PM Modi Hyderabad Tour: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్- ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకుంటోంది. ఈ వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.25 గంటలకు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరకుంటారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు రాష్ట్ర అధికారులు, భాజపా నాయకులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.
అనంతరం భాజపా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం ముందు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘన స్వాగతం పలికి సన్మానించనుంది. పార్టీ శ్రేణులకు మోదీ అభివాదం చేసిన ఉత్తేజాన్ని నింపనున్నారు. తరువాత బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియంకు చేరకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎస్‌బీకి చేరుకుంటారు.
తొలిసారిగా ఐఎస్‌బీ హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లతో కలిపి ఉమ్మడి స్నాతకోత్సవం నిర్వహిస్తోంది. ఈ స్నాతకోత్సవంలో 2022 సంవత్సరానికి గాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 930మంది విద్యార్థులకు పట్టాలు పంపిణి చేయనున్నారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్న ప్రధాని మధ్యాహ్నాం 2 గంటలకు ఐఎస్‌బీకి చేరుకుంటారు. తొలుత అకాడమిక్ సెంటర్‌లో మొక్కను నాటుతారు. అనంతరం ఐఎస్బీ చరిత్రను ప్రధాని మోదీకి డీన్ మదన్ పిల్లుట్ల వివరిస్తారు. సిబ్బందితో ఫోటో దిగుతారు.అనంతరం విజిటర్స్ బుక్‌లో సంతకం చేసి వేదికపైకి చేరుకుంటారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో గోల్డ్ మెడల్ సాధించిన పదిమంది విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను అందచేస్తారు. అనంతరం 2.35 గంటల నుంచి 3.10 గంటల వరకు విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. గంటపాటు ఐఎస్బీలో గడపనున్న ప్రధాని.. 3.15 గంటలకు కార్యక్రమాన్ని ముగించుకుని బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరుతారు. తిరిగి 3.50 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై బయల్దేరి వెళ్లనున్నారు. తిరుగు ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానికి తలసాని వీడ్కోలు పలుకుతారు. మోదీ రాక నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయాన్ని ఎస్పీజీ తన అధీనంలోకి తీసుకుంది. భద్రతలో పాల్గొనే సిబ్బందికి అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఐఎస్‌బీకి 5 కి.మీ పరిధిలో రిమోట్ కంట్రోల్ డ్రోన్ల వాడకంపై నిషేధం విధించారు. ప్యారాగ్లైడింగ్, మైక్రో లైట్ ఎయిర్ క్రాప్ట్స్‌పై నిషేధం విధించిన పోలీసులు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క ఐఎస్‌బీలోనే సుమారు 2 వేల మందితో బందోబస్తు చేపడుతున్నారు. ప్రధాని పర్యటన సమయంలో డ్రోన్లు వాడేందుకు అనుమతించారు. ఈ ఆంక్షలు రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు అమల్లో ఉండనున్నాయి.
గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో కూడలి వరకు ఉన్న కంపెనీలకు పోలీసులు సూచనలు చేశారు. పనివేళల్లో మార్పులు చేసుకోవాలని ఐటీ కంపెనీలకు సూచించారు. గచ్చిబౌలి కూడలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలను.. బొటానికల్ గార్డెన్ నుంచి హెచ్‌సీయూ డిపో మీదుగా వెళ్లాలని తెలిపారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు.. హెచ్‌సీయూ డిపో నుంచి బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలని చెప్పారు. విప్రో కూడలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. క్యూసిటీ, గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల మీదుగా వెళ్లాలని పేర్కొన్నారు. విప్రో కూడలి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలు.. ఫెయిర్‌ఫీల్డ్ హోటల్ నుంచి ఎల్ అండ్ టీ టవర్స్ వైపు వెళ్లాలని.. తీగల వంతెన నుంచి గచ్చిబౌలి కూడలి వైపు వెళ్లే వాహనాలు.. మాదాపూర్ పీఎస్ నుంచి బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. నేడు హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనుండగా.. సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు.
ఇవీ చదవండి: