ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకున్న ఆయన.. పెదఅమిరంలో ఏర్పాటు చేసిన అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ సాదరంగా స్వాగతం పలికి సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి.. విల్లంబు, బాణం బహూకరించారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సముచితంగా సత్కరించారు. సభా వేదిక నుంచే వర్చువల్ పద్ధతిలో భీమవరంలో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు.
అల్లూరి 125వ జయంతి ఉత్సవాల వేళ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని.. తొలుత తెలుగులో ప్రజలను పలకరించారు. అల్లూరి జయంతి రోజు అందరం కలుసుకోవడం అదృష్టమన్న మోదీ.. గొప్ప స్వాంతంత్య్ర సమరయోధుడి కుటుంబ సభ్యులను కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యిందని.. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ వివరించారు. ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురిటిగడ్డగా మోదీ వర్ణించారు. ఇక్కడి బలిదానాల చరిత్ర, ఆదివాసీల వీరగాథలు ప్రేరణ నింపుతాయన్నారు. మహోన్నతమైన ఈ పుణ్యభూమికి నమస్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ గడ్డపై పుట్టిన అల్లూరి.. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చారన్నారు.
"పాండ్రంగిలోని అల్లూరి జన్మస్థలం, చింతపల్లి అభివృద్ధితో పాటు.. మోగల్లులో ధ్యాన మందిర నిర్మాణం.. మా అమృత్ భావనకు ప్రతీక. అల్లూరి సీతారామరాజు.. దేశ సంస్కృతికి, ధైర్యసాహసాలు, ఆదర్శాలకు ప్రతీక. వేల సంవత్సరాలుగా దేశాన్ని ఏకం చేస్తూ వచ్చిన ఏక్ భారత్... శ్రేష్ఠ్ భారత్‌కు అల్లూరి సీతారామరాజు ప్రతిరూపం. సీతారామరాజు పుట్టినప్పటి నుంచి బలిదానం వరకూ ఆయన జీవితం మనందరికీ ప్రేరణ లాంటిది. ఆయన తన జీవితాన్ని ఆదివాసీల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ధారపోశారు." -నరేంద్ర మోదీ, ప్రధాని
అల్లూరి సీతారామరాజు స్మారక గిరిజన స్వాంతంత్య్ర సమరయోధుల మ్యూజియం లంబసింగిలో నిర్మిస్తున్నామన్న మోదీ.. యావత్ భారతావనికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
"స్వాంతంత్య్ర పోరాటంలో దేశం కోసం యువకులు ముందుకొచ్చి నేతృత్వం వహించారు. నేడు నవభారత నిర్మాణం స్వప్నాన్ని సాకారం చేసేందుకు యువత ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అనేక కొత్త సంస్థలు వస్తున్నాయి. కొత్త ఆలోచనలతో ఎన్నో కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. వీటిని సాకారం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో మన యువత ఈ బాధ్యతలను తమ భుజస్కంధాలపై మోసుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు."- నరేంద్ర మోదీ, ప్రధాని
దేశంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్న ప్రధాని.. సమస్యలపై పోరాడే తత్వం అల్లూరి నుంచి నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
"స్వాంతంత్య్ర సమరయోధుల కలను సాకారం చేసే బాధ్యత దేశ ప్రజలందరిది. 130 కోట్ల మంది ప్రజలది. మన నవ భారతం సమరయోధుల స్వప్నానికి ప్రతిరూపంగా ఉండాలి. పేదలు, రైతులు, కార్మికులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలందరికీ అందులో సమాన అవకాశాలు ఉండాలి. దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కోండి అంటూ..130కోట్ల మంది దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. మన యువకులు, ఆదివాసీలు, మహిళలు, దళితులు, పీడిత వర్గాలు తలుచుకుంటే నవ భారత నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు."- నరేంద్ర మోదీ, ప్రధాని
ఆదివాసీల అభివృద్ధిలో భాగంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని ప్రధాని తెలిపారు.
ఇవీ చదవండి: