గర్భధారణ అతి సున్నితమైన, అతి సంక్లిష్టమైన ప్రక్రియ. చిన్న పొరపాటు దొర్లినా పిండం మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. సహజంగానే గర్భిణులకు ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. పిండాన్ని తిరస్కరించకుండా ఉండటానికి శరీరం తనకు తానుగానే రోగనిరోధకశక్తిని కాస్త అణచిపెట్టుకొని ఉంటుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ల ముప్పూ పెరుగుతుంది. వీటిల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్లు గర్భిణులకు తీవ్ర సమస్యలు తెచ్చిపెడతాయి. కొన్ని ఇన్‌ఫెక్షన్లతో పుట్టబోయే బిడ్డకూ అవకరాలు తలెత్తొచ్ఛు అందుకే కరోనా భయం గర్భిణులకు, సంతానం కోసం ప్రయత్నించేవారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదృష్టం కొద్దీ కరోనా జబ్బుతో తల్లికి, బిడ్డకు పెద్దగా ప్రమాదమేదీ లేదనే అనిపిస్తోంది.
ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రుల్లో జరుగుతున్న కాన్పులే దీనికి నిదర్శనం. కొవిడ్-19 పాజిటివ్ ఉన్న గర్భిణులంతా పండంటి బిడ్డల్నే కంటుండటం, చికిత్సలో భాగంగా ఇచ్చిన మందులతోనూ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోవటం విశేషం. గర్భిణులకు కరోనా జబ్బు ముప్పేమీ పెరగటం లేదు కూడా. మిగతావాళ్ల మాదిరిగానే వీరికీ ముప్పు ఉంటోంది. కాకపోతే పుట్టుకతో గుండెజబ్బులు గలవారికి ఇన్‌ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువ. కొవిడ్ మూలంగా న్యుమోనియా తలెత్తినా మరీ తీవ్రంగా ఏమీ ఉండటం లేదు. చికిత్సతో గర్భిణులు బాగా కోలుకుంటున్నారు. అంతమాత్రాన అసలే ప్రమాదం లేదనుకోవటానికి లేదు. ఇన్‌ఫెక్షన్ ఎప్పుడెలా సంక్రమిస్తుందో, ఎలా పరిణమిస్తుందో, ఎలాంటి వైపరీత్యాలను సృష్టిస్తుందో కచ్చితంగా తెలియదు. ఈ భయాలకు తోడు ఆందోళన, కుంగుబాటు వంటివీ తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. అందువల్ల గర్భిణులకు అంతా అండగా ఉండటం అత్యవసరం. గర్భిణులు కూడా ఎవరి జాగ్రత్తలో వారుండటం చాలా ముఖ్యం. వీరికి కాన్పు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మూడు రకాలుగా..
కొవిడ్ విషయంలో గర్భిణులను మూడు రకాలుగా వర్గీకరించొచ్ఛు 1. కరోనా బాధితులతో ఏమాత్రం సంబంధం లేనివారు. 2. కరోనా పాజిటివ్‌గా ఉన్నా లక్షణాలు లేనివారు. 3. కరోనా జబ్బు లక్షణాలు గలవారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు, చికిత్సలు, కాన్పుల విషయంలో ఈ విభజన చాలా ముఖ్యం. కరోనా బాధితులతో ఎలాంటి సంబంధం లేనివారు మామూలు ఆసుపత్రుల్లో అవసరమైన చికిత్సలు చేయించుకోవచ్ఛు అయితే కరోనా ఉన్నా లక్షణాలు లేనివారు చాలామంది ఉంటున్నారు కాబట్టి ఆసుపత్రులు, డాక్టర్లు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు ఆసుపత్రిలోకి రాగానే సబ్బుతో చేతులు కడుక్కునేలా లేదా శానిటైజర్ రాసుకునేలా చూడాలి. ముఖానికి మాస్కు ధరించకపోతే మాస్కు ఇవ్వాలి. ఆ తర్వాతే పరీక్షించాలి. పరీక్ష చేసేటప్పుడూ డాక్టర్లు, సిబ్బంది చేతులకు గ్లవుజులు వేసుకోవాలి. కరోనా వైరస్ సోకినవారి విషయంలో శరీరాన్ని కప్పి ఉంచే పీపీఈ తొడుగు ధరించి పరీక్షలు, చికిత్సలు చేయాలి.
ఎవరికి పరీక్షలు?
ఐసీఎంఆర్ సూచనల ప్రకారం- కరోనా ప్రబలిన చోట్ల, దిగ్బంధం విధించిన ప్రాంతాల్లోని గర్భిణుల్లో కాన్పయ్యే సూచనలు కనిపిస్తున్నా, మరో ఐదు రోజుల్లో కాన్పయ్యే అవకాశాలున్నా లక్షణాలేవీ లేకపోయినా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చెయ్యాలి. అదీ నిర్దేశించిన కేంద్రాల్లోనే చెయ్యాలి. మిగతా గర్భిణుల విషయంలో- కరోనా బాధితులకు సన్నిహితంగా ఉన్నట్టు తెలిసినా, కరోనా అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించాలి. ఫలితాలు వచ్చేంతవరకు కరోనా ఉన్నట్టుగానే పరిగణించాలి. అవసరమైన చికిత్సలు చేయాలి.
ఆచి తూచి చికిత్స..
కరోనా ఇన్‌ఫెక్షన్ సోకినట్టు తేలితే- లక్షణాలేవీ లేకపోతే నిపుణుల సూచనల మేరకు ఇంట్లోనే విడిగా (క్వారంటైన్) ఉంటే సరిపోతుంది. పరీక్ష ఫలితం నెగెటివ్‌గా వచ్చిన తర్వాత 28 రోజుల వరకూ దూరంగానే ఉండాలి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలుంటే విధిగా ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాల్లో విడిగా (ఐసోలేషన్) పర్యవేక్షించాల్సి ఉంటుంది. రోజూ రక్తపోటు, ఛాతీ ఎక్స్‌రే, స్కాన్ వంటి పరీక్షలు అవసరమవుతాయి. పిండం గుండె వేగం, పిండం ఎదుగుదల తీరుతెన్నులను పరిశీలిస్తూ ఉండాలి. అవసరమైతే రక్తనాళం ద్వారా యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, ఇతరత్రా వైరల్ మందులతో ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. గుండెజబ్బులు గలవారి విషయంలో క్లోరోక్విన్ వాడకంలో జాగ్రత్త అవసరం. గర్భిణులకు రక్తపోటు, శ్వాసవేగం పెరుగుతున్నా.. స్పృహ తప్పుతున్నట్టు అనిపిస్తున్నా వెంటనే అత్యవసర చికిత్స విభాగానికి తరలించి, చికిత్స చేయాలి. చికిత్స తీసుకున్నాక పరీక్ష నెగెటివ్‌గా వచ్చినా 28 రోజుల పాటు ఇతరులతో కలవకుండా విడిగానే ఉండాలి.
కొవిడ్ కేంద్రాల్లోనే కాన్పు
కరోనా పాజిటివ్ ఉన్నా, లేకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడపడితే అక్కడ కాన్పు చేయటం తగదు. కొవిడ్-19 చికిత్స కేంద్రాల్లోనే చెయ్యాలి. కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నవారి పరిస్థితి ఎప్పుడెలా మారుతుందో తెలియదు. కొన్ని గంటల్లోనే తీవ్రం కావొచ్ఛు ఇలాంటి సమయంలో వెంటనే అత్యవసర విభాగానికి తరలించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రసూతి డాక్టర్, నర్సు, ఆయాలతో పాటు మత్తు నిపుణులు, పిల్లల నిపుణులు, ఇన్‌ఫెక్షన్ల నిపుణులు అంతా ఒక బృందంగా పనిచేయాల్సి ఉంటుంది. కరోనా లేనివారి విషయంలో వైరస్ సోకుండా చూసుకోవటం ముఖ్యం. ఆసుపత్రుల్లో ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. అందరిలో లక్షణాలు కనిపించవు కాబట్టి ఎవరికి వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలుసుకోవటం కష్టం. అందువల్ల అన్ని సదుపాయాలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు గల కేంద్రాల్లోనే కాన్పు చెయ్యటం మంచిది.
సిజేరియన్ కాన్పే మేలు
కరోనా విజృంభిస్తున్న తరుణంలో వీలైనంత త్వరగా కాన్పయ్యేలా చూడటం మంచిది. అందువల్ల సహజ కాన్పు కన్నా సిజేరియన్ కాన్పు చేయటమే మంచిది. ఇప్పుడు చాలాదేశాల్లో ఇదే చేస్తున్నారు. సహజ కాన్పు పూర్తి కావటానికి కనీసం 12 గంటలు పడుతుంది. పిండం ముందుకు కదులుతోందా? లేదా? అనేది నిరంతరం చూసుకోవాల్సి ఉంటుంది. అంతసేపూ ప్రసూతి గదిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, సహాయకులు అంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే పీపీఈలు వేసుకొని ఉండాలి. అంతసేపు వీటిని ధరించటం కష్టం. కొవిడ్ పాజిటివ్‌గా ఉన్నవారు ప్రస్తుతం బాగానే ఉన్నా రెండు, మూడు గంటల్లోనే ఇన్‌ఫెక్షన్ తీవ్రమై సమస్యలు సృష్టించొచ్ఛు ఇన్‌ఫెక్షన్ రక్తంలోకి వ్యాపించటం, అవయవాలు విఫలం కావటం, పిండం ఆరోగ్యం దెబ్బతినటం వంటివి గుర్తిస్తే వెంటనే సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడు సిజేరియన్ ఏర్పాట్లు చేయటం కష్టం. వెంటిలేటర్ మీద పెట్టాలన్నా ముందు బిడ్డను బయటకు తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే గర్భిణులకు కడుపు ఎత్తుగా ఉంటుంది కాబట్టి వెంటిలేటర్ సరిగా పనిచేయదు. ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. కాన్పయిన వెంటనే బిడ్డకు వైరస్ పాజిటివ్ ఉందో లేదో తెలియదు కాబట్టి నియోనేటల్ విభాగానికి పంపించాల్సి ఉంటుంది. వీటన్నింటిని బట్టి చూస్తే సహజ కాన్పు కన్నా సిజేరియనే మేలు. ఆపరేషన్ గదిలో ఏసీ లేకపోవటం మంచిది. ఫ్యాన్లు వేసుకోవచ్ఛు గర్భిణికి తోడుగా ఒకరు ప్రసూతి గదిలో ఉండొచ్చు గానీ విధిగా పీపీఈ ధరించాలి.●
గర్భస్రావ ముప్పు లేదు
కరోనా భయం మూలంగా కొందరు గర్భిణులు గర్భాన్ని తీయించుకోవాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు. కరోనా జబ్బు మూలంగా గర్భస్రావం అవుతుందని గానీ నెలలు నిండకముందే కాన్పు అవుతున్నట్టు గానీ ఇప్పటివరకూ బయటపడలేదు. పిండానికి అవకరాలు, లోపాలు తలెత్తుతున్నట్టూ తేలలేదు. అందువల్ల గర్భాన్ని తొలగించుకోవటం తగదు. అనవసరంగా అబార్షన్‌కు ప్రయత్నిస్తే ఆసుపత్రి వాతావరణం, ఇతరుల నుంచి వైరస్ అంటుకునే ప్రమాదముందని తెలుసుకోవాలి.
తల్లి పాలు పట్టొచ్చా?
తల్లిపాలలో కరోనా వైరస్ ఆనవాళ్లేవీ బయటపడలేదు. కాబట్టి కొవిడ్-19 బారినపడ్డా శిశువుకు పాలు పట్టొచ్ఛు కాకపోతే తల్లి విధిగా మాస్కు ధరించాలి. పాలిచ్చేముందు, తర్వాత చేతులు కడుక్కోవాలి. బిడ్డ తల్లి దగ్గర ఉండటం మంచిది కాదనేది మరికొందరి భయం. అంత భయపడాల్సిన పనిలేదు. స్త్రీ, శిశు చికిత్సల సంస్థల మార్గదర్శకాలన్నీ శిశువుకు పాలివ్వచ్చని, బిడ్డ తల్లి దగ్గర ఉన్నా ఇబ్బంది ఉండదనే చెబుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం. బిడ్డను తనే చూసుకుంటుంటే శిశువు దుస్తులు, డైపర్లు మార్చే ముందు, తర్వాత చేతులు కడుక్కోవాలి. మల విసర్జన అనంతరం తల్లి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి.
శృంగారంతో రాదు!
కరోనా వైరస్ ఒంట్లో ఏసీఈ2 (యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్) గ్రాహకాలు ఉన్న భాగాల్లోకే వెళ్తోంది. వృషణాల్లో ఏసీఈ2 గ్రాహకాలు అంతగా ఉండవు. ఇప్పటివరకు కరోనా వైరస్ వీర్యంలో ఉన్నట్టు వెల్లడికాలేదు. అందువల్ల శృంగారం ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలు లేవనే చెప్పుకోవచ్ఛు కానీ కరోనా సోకినవారికి, జబ్బు సోకినా లక్షణాలు లేనివారికి సన్నిహితంగా ఉంటే మాత్రం అంటుకుంటుంది.
ఇప్పుడు గర్భధారణ వద్దు
ప్రస్తుత పరిస్థితుల్లో గర్భధారణకు ప్రయత్నించకపోవటమే మంచిది. కరోనా ఎవరికి వస్తుందో, ఎవరికి రాదో తెలియదు. మున్ముందు ఎలా పరిణమిస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లయిన జంటలు, గర్భధారణకు ప్రయత్నించేవారు కరోనా తీవ్రత తగ్గేంతవరకు సంతాన ప్రయత్నాలేవీ చేయకపోవటం మేలు. కనీసం ఆరు నెలల వరకైనా వాయిదా వేసుకోవటం ఉత్తమం. ఇప్పుడు చాలాచోట్ల సంతాన సాఫల్య చికిత్సలను ఆపేశారు. ఒకవేళ ఆరంభించినా అండాలను భద్రపరుస్తున్నారు.
తప్పనిసరిగా గర్భిణి పరీక్షలు
గర్భిణులంతా తప్పనిసరిగా నాలుగు సార్లు పరీక్షలు చేయించుకోవాలి. మొదటి పరీక్ష 12వ వారంలో.. ఆ తర్వాత 20, 28, 36 వారాల్లో విధిగా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి. అవసరమైన పరీక్షలన్నీ చేయించుకోవాలి. 12వ వారంలో ఒకసారి, 20వ వారంలో స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి. ఇటీవలి కాలంలో వేరేచోట్లకు ఎక్కడికైనా వెళ్లినా, వేరే ప్రాంతం నుంచి వచ్చినా ఆ విషయాన్ని డాక్టర్‌కు, వైద్య సిబ్బందికి ముందే చెప్పాలి. పరీక్షించిన తర్వాత ఫలానా చోటుకు వెళ్లి వచ్చామని చెబితే డాక్టర్లను, అక్కడి సిబ్బందిని ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది. జ్వరం, దగ్గు, తుమ్ములు లేనంత మాత్రాన అంతా బాగానే ఉందని అనుకోవటానికి లేదు. కరోనాలో అందరికీ లక్షణాలు స్పష్టంగా కనిపించాలని లేదని తెలుసుకోవాలి. వేరే చోట్లకు వెళ్తే అక్కడ కరోనా సోకి ఉండొచ్ఛు ముందే డాక్టర్‌కు చెబితే అందరికీ మంచిది.
భయపడొద్ధు. దాడులొద్దు
కొవిడ్ భయంతో కొందరు డాక్టర్లు గర్భిణులకు చికిత్సలు, కాన్పు చేయటానికి వెనకాడుతున్నారు. హెచ్‌ఐవీ ప్రబలిన తొలినాళ్లలోనూ ఇలాగే భయపడేవారు. దీనికి ప్రధాన కారణం వైరస్ తమకూ సోకుతుందేమోనని జంకటం. మరోవైపు జరగకూడనిదేదైనా జరిగితే దాడులు చేస్తారేమోనని భయపడటం. వైరస్ పాజిటివ్‌గా ఉన్నా లేకపోయినా మామూలు చికిత్సలు, పరీక్షలు నిరభ్యంతరంగా చేయొచ్ఛు అయితే తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు కూడా కరోనా జబ్బు పరిణామాలను అర్థం చేసుకోవాలి. ఇన్‌ఫెక్షన్ ఎప్పుడైనా తీవ్రం కావొచ్చని, గర్భిణులకిది మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుందని తెలుసుకోవాలి. ఏదైనా జరిగితే డాక్టర్లను నిందించటం, దాడి చేయటం తగదని గుర్తించాలి. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమకు వైరస్ సోకే అవకాశముందని తెలిసీ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారనే సంగతిని గ్రహించాలి. ఎవరూ కావాలని ప్రాణాలకు అపాయం తలపెట్టరనే విషయాన్ని తెలుసుకొని మసలుకోవాలి.
బిడ్డకు సంక్రమిస్తుందా?
తల్లికి కరోనా వైరస్ సోకితే బిడ్డకూ సంక్రమిస్తుందా? అందరినీ భయపెడుతున్న ప్రశ్న ఇది. ఇప్పటివరకైతే తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమిస్తుందనటానికి కచ్చితమైన ఆధారాలేవీ లేవు. కానీ ఇటీవల కరోనా ఇన్‌ఫెక్షన్ గల గర్భిణికి పుట్టిన శిశువులోనూ వైరస్ పాజిటివ్‌గా తేలటం కలవరం కలిగిస్తోంది. అయితే ఇది తల్లి కడుపులో ఉన్నప్పుడే సోకిందా? పుట్టిన తర్వాత సోకిందా? అన్నది కచ్చితంగా తెలియదు. ఉమ్మనీటిలో, జననాంగ స్రావాల్లో వైరస్ ఉంటున్నట్టు ఇప్పటివరకూ బయటపడలేదు.
జాగ్రత్తలు అవసరం..
వైరస్ బారినపడకుండా గర్భిణులంతా ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకోవటం అత్యవసరం.
* గర్భిణులంతా వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి. అవసరమైతేనే ఆసుపత్రికి రావాలి.
* ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటే వారికి దూరంగా ఉండాలి. వేరే గదిలో ఉంటే ఇంకా మంచిది. ఇంట్లో ఎవరికీ కరోనా లేకపోయినా వీలైనంతవరకు కుటుంబ సభ్యులకు దూరంగా మెలగటమే మేలు.
* తరచూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.
* దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు కనిపిస్తే తాత్సారం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
* బయటకు వెళ్లినప్పుడు విధిగా ఇతరులకు కనీసం మీటరు దూరంలో ఉండాలి.
* ఐరన్, క్యాల్షియం, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ డి మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఆపేయకూడదు.
ఇవీ చదవండి: 'బడాబాబులకు రూ.68 వేల కోట్ల రుణమాఫీ'