నెల్లూరు జిల్లాలో...
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన నెల్లూరు కలెక్టర్ చక్రధర బాబు.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆయన సేవలను కొనియాడారు. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహానుభావుడిగా ఆయనను కీర్తించారు. అమరజీవి ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన 68వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
నాయుడుపేటలోని వైకాపా, తెదేపా శ్రేణులు.. పొట్టి శ్రీరాములుకు వేర్వేరుగా ఘన నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి.. ఆ మహనీయుడి సేవలను కొనియాడారు. ఆయన ప్రాణత్యాగంతో తీసుకువచ్చిన రాష్ట్రం.. అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు.
కృష్ణా జిల్లాలో...
కృష్ణా జిల్లా నందిగామలో ఆర్య వైశ్య సంఘం నేతలు.. పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగిన అమరజీవి నుంచి.. యువత స్ఫూర్తి పొందాలని ఆ సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు అన్నారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు నగరంలోని హిందూ కళాశాల కూడలిలోని.. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిధర్‌రావు, ముస్తఫాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వర్థంతి సందర్భంగా.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పాటుపడిన మహనీయుడిని స్మరించుకోవాల్సిన అవశ్యకత ఉందన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు, దేశ మొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా.. కలెక్టరేట్‌లోని వీసీ హాలులో వారి చిత్ర పటాలకు గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, జేసీ ఏఎస్ దినేష్‌కుమార్‌లు నివాళులర్పించారు. వివిధ సంస్థానాలను విలీనం చేసి విశాల భారతావని సాధించిన గొప్ప దేశభక్తుడు పటేల్ కాగా.. ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీరాములని కొనియాడారు.
నరసరావుపేట తెదేపా కార్యాలయంలో పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి ఘనంగా జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద బాబు.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌నూ గుర్తు చేసుకుని శ్రద్ధాంజలి ఘటించారు.
విశాఖ జిల్లాలో...
ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు ఆర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు.. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఎమ్మెల్యేలు కన్నబాబు, అదీప్ రాజ్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ ఘన నివాళులు ఆర్పించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని బీచ్ రోడ్డులోని విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రతి ఏటా ఈరోజ ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుని.. ఆయన త్యాగాన్ని స్మరించుకుంటున్నామన్నారు.
రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతిని.. తెలుగు శక్తి సంస్థ విశాఖలో ఘనంగా నిర్వహిచింది. బీచ్ రోడ్డులోని అమరజీవి విగ్రహాన్ని శుభ్రం చేసి.. పూల మాలలు వేసి నివాళులు అర్పించింది. ప్రభుత్వం కనీసం ఆయన విగ్రహాన్ని శుభ్రం చేయకుండా అవమానించారని సంస్థ వ్యవస్థాపకులు బీవీ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన సీఎం జగన్.. రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన అమరజీవి వర్ధంతి నిర్వహించక పోవడంపై మండిపడ్డారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి.. అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా.. విశాఖ జిల్లా అనకాపల్లిలో సిద్ధార్థ సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఘన నివాళి అర్పించింది. ఆయన విగ్రహానికి స్థానిక సబ్ జైలు సూపరింటెండెంట్ ఒమ్మి అప్పల నారాయణ, అనకాపల్లి పట్టణ ఎస్ఐ ధనుంజయ్ పూలమాలలు వేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆ మహానుభావుడి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
ఆంధ్ర రాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు 68వ వర్ధంతి.. జగ్గంపేట తెదేపా కార్యాలయంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తెలుగు ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా చేశారని కొనియాడారు. ప్రస్తుత సమయంలో అమరావతిని రాజధానిగా సాధించుకోవడానికి.. మరో పొట్టి శ్రీరాములు రావాలన్నారు.
ప్రకాశం జిల్లాలో...
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని.. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్సీ పోతుల సునీత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం ఆయన ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి.. ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు. ఆయన త్యాగఫలంగానే ప్రతి ఏటా నవంబర్ 1న ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.
కడప జిల్లాలో...
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని కడప అదనపు ఎస్పీ ఖాసిం సాహెబ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన 68వ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే తృణప్రాయంగా భావించారని గుర్తు చేశారు.
విజయనగరంలో...
కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో.. అమరజీవి పొట్టి శ్రీరాములుకు జిల్లా పాలనాధికారి హరి జవహర్ లాల్ ఘనంగా నివాళులర్పించారు. ఆయన వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలు వేశారు. తెలుగు జాతికి ఆ మహనీయుడు చేసిన సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలంతో పాటు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: