పాలిటెక్నిక్‌లలో ప్రవేశం కోసం పాలిసెట్-2021ని సెప్టెంబరు 1వ తేదీన రాష్ట్రంలోని 385 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు ధనేకుల పాలిటెక్నిక్ కళాశాలలో ఆయన తెలిపారు. పరీక్షలకు విజయవాడలో 45 కో-ఆర్డినేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారానే ప్రశ్నపత్రాలు ప్రభుత్వ సెక్యూరిటీ ద్వారా పరీక్ష కేంద్రాలకు చేరవేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 72 వేల సీట్లకు పాలిసెట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 30,000 దరఖాస్తులు అందాయని, చివరి తేదీ ఆగస్టు 13గా నిర్ణయించామన్నారు. అవసరమైతే దరఖాస్తు తేదీని పొడిగిస్తామన్నారు.
పాలిటెక్నిక్ విద్యపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు బ్రోచర్లు విడుదల చేశారు. అంతకుముందు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో జరిగిన సమావేశంలో పాలిసెట్ సన్నద్ధతపై ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్జేడీ పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.