రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పలువురు ఓటర్లు.. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. 8 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోగా.. పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించిన 11 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2 వేల 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలుండగా.. 2వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.
నిలిచిన పోలింగ్...
విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో.. ఎంపీటీసీ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థి పేరుకు బదులుగా.. విత్‌డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు ముద్రించారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపరులో పేరు తప్పుగా ముద్రించటంతో.. రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు.. జిల్లా కలెక్టర్ జరిజవహర్ లాల్ తెలిపారు.
జనసేన నాయకుడి ఇంటిపై దాడి...
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైకాపా వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వైకాపా వర్గీయులను చెదరగొట్టారు. ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అరాచకాలు పెచ్చుమీరాయని.. మధుసూధన్‌రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి: 'రెండో దశలో నేరుగా రక్తంలోకి వెళ్తున్న వైరస్'