కొవిడ్ బారినపడి ఐసొలేషన్‌లో ఉన్నవారు ఆన్‌లైన్ వైద్య సేవలు పొందేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వై-ఫై (విత్ యూ-ఫర్ యూ) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రోజూ ఉదయం 6-8 గంటల మధ్య కొవిడ్ రోగులు ఎవరైనా ఈ సేవల్ని పొందొచ్చు. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్ర వైద్యులు, స్థానికంగా ఉండే మరికొందరు వైద్యులు రోగులతో మాట్లాడి వారి లక్షణాల ఆధారంగా చికిత్సను సూచిస్తుంటారు. నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందుకు బాధితులు జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ కావాలి. మీటింగ్ ఐడీ: 884 2913 4784; పాస్‌కోడ్: 168462. ఇప్పటివరకూ 500 మంది వరకూ ఈ సేవలు వినియోగించుకున్నారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్త పరిస్థితులు, ఏయే దేశాల్లో ఎలాంటి ఆచరణలు అమలు చేస్తున్నారు? తదితర అంశాలపై దేశ, విదేశాల్లోని వైద్యారోగ్య రంగ నిపుణులతో ఆన్‌లైన్‌లో చర్చించేందుకు వీలుగా ‘హోప్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు రోజూ సాయంత్రం 3-4 గంటలు ఆయా రంగాల నిపుణులతో ఆన్‌లైన్‌లో జరిగే చర్చలో పాల్గొంటున్నారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది కొవిడ్ రోగులకు అవసరమైన ఆహారం, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, నిత్యావసరాలు, మందులు అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో కొంతమంది వాలంటీర్లు ‘హోప్ ఛాంపియన్స్’ పేరిట పనిచేస్తున్నారు. కొవిడ్ రోగులు ఏదైనా అవసరంపై ట్వీట్ చేస్తే చాలు.. హోప్ హెల్ప్ కార్యక్రమం ద్వారా హోప్ ఛాంపియన్లు వారికి సాయమందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వైకాపా కాల్‌సెంటర్
కొవిడ్ బాధితుల కోసం వైకాపా నేతలు వారి వారి ప్రాంతాల్లో వివిధ రూపాల్లో సాయమందిస్తున్నారు. కొన్ని చోట్ల ఆహారం పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల మందులు అందజేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు తమ పరిధిలోని ప్రజల కోసం స్థానికంగా రెండు వాట్సాప్ నంబర్లు అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లోని కొవిడ్ బాధితులు ఎవరైనా ఆ నంబర్లలో సంప్రదిస్తే అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని కొవిడ్ కేర్ కేంద్రాల్ని ఏర్పాటుచేసి నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో పార్టీ ఆధ్వర్యంలో ఒక కొవిడ్ కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేశారు. వాటి ద్వారా బాధితులకు సాయాన్ని అందిస్తున్నారు.
భాజపా.. టెలిమెడిసిన్ హెల్ప్‌లైన్
భాజపా ఆంధ్రప్రదేశ్ శాఖ కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా టెలిమెడిసిన్ హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసింది. బాధితులు రోజూ ఉదయం 9 గంటలనుంచి రాత్రి 9 గంటల మధ్య 7207485650 నంబరుకు ఫోన్ చేస్తే వైద్యుల్ని సంప్రదించి వారి సేవలను ఉచితంగా పొందొచ్చు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పడకల లభ్యత, ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ లభిస్తాయి? కొవిడ్ టీకా కేంద్రాలు, అంబులెన్సు సర్వీసుల వివరాలను అందించేందుకు మరో కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేసింది. 0866-2441138 నంబరుకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ చేసి ఈ వివరాలు తెలుసుకోవచ్చు.
క్షేత్రస్థాయిలో జనసేన
జనసేన నాయకులు వారివారి ప్రాంతాల్లో తోచిన రీతిలో సాయమందిస్తున్నారు. కోనసీమలో ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధం చేసుకొని అత్యవసరమైన వారికి వాటిని అందిస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైద్యనిపుణులతో ఆన్‌లైన్ ద్వారా చికిత్స, సూచనలు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రోజూ ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఫ్రంట్‌లైన్ వారియర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నారు. వీటిని రాష్ట్రస్థాయిలో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు.
సీపీఐ, కాంగ్రెస్ సైతం..
సీపీఐ ఆన్‌లైన్ కొవిడ్ సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసింది. 7702962177, 7702972177, 7702948477, 7702939377 నంబర్లకు ఫోన్ చేసి కొవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. విజయవాడ ఆటోనగర్‌లో కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఇటీవల ప్రారంభించింది. జిల్లాల్లోని కొన్ని కార్యాలయాల్ని కూడా కొవిడ్ కేర్‌సెంటర్లుగా వినియోగిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా కొవిడ్ సహాయకేంద్రాల్ని ఏర్పాటుచేసి కొన్ని ఫోన్‌నంబర్లు విడుదల చేసింది. వాటికి కాల్ చేసిన వారికి అవసరమైన సమాచారాన్ని అందిస్తోంది.
ఇదీ చదవండి: