తెలుగుదేశం పార్టీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆదాయానికి మించి ఖర్చు చేసినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. ఆ సంవత్సరంలో దేశంలోని 2 జాతీయ, 17 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆదాయ, వ్యయ లెక్కలను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తెరాస, వైకాపా ఆదాయ, వ్యయ లెక్కలు ఈసీఐ వెబ్‌సైట్‌లో కనిపించలేదని పేర్కొంది. 2019-20లో తెదేపాకు రూ.91.53 కోట్ల ఆదాయం రాగా రూ.108.84 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
2 జాతీయ, 17 ప్రాంతీయ పార్టీల్లో 10 పార్టీలు ఆదాయాన్ని మించి వ్యయం చేయగా, మరో 9 పార్టీల ఖర్చు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. టీఎంసీ వద్ద రూ.36 కోట్లు మిగలగా, బిజద రూ.95.78 కోట్లు అధికంగా ఖర్చు చేసినట్లు తెలిపింది. బీఎస్‌పీ కూడా ఆదాయాన్ని మించి రూ.36 కోట్లు అధికంగా ఖర్చు చేసినట్లు తెలిపింది. 2019-20 సంవత్సరం ఆదాయ వ్యయ లెక్కలను పార్టీలు 2020 అక్టోబరు 31నాటికి సమర్పించాల్సి ఉండగా 19 పార్టీలే కొంత ఆలస్యంగా సమర్పించినట్లు పేర్కొంది.
తెదేపా 73 రోజుల ఆలస్యంతో జనవరి 11న తన లెక్కలు సమర్పించింది. ఈ పార్టీకి 2018-19లో రూ.114.96 కోట్ల ఆదాయం రాగా, 2019-20లో అది రూ.91.53 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో టీఎంసీకి రూ.48.98 కోట్లు, బిజదకు రూ.158 కోట్ల ఆదాయం తగ్గినట్టు తెలిపింది. గడువు ముగిసి ఇప్పటికి 168 రోజులు దాటినా.. ఇంకా 41 పార్టీల ఆడిట్ రిపోర్టులు ఈసీఐ వెబ్‌సైట్‌లో కనిపించలేదని తెలిపింది. ఇందులో భాజపా, కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, వైకాపా, తెరాస, ఎంఐఎం, ఆప్, ఆర్‌జేడీ సహా మరికొన్ని పార్టీలున్నట్లు వెల్లడించింది.
కేంద్ర ఎన్నికల సంఘానికి లెక్కలు సమర్పించిన 19 పార్టీలు కలిపి వచ్చిన రూ.619 కోట్లలో తెదేపా వాటా 14.78% ఉండగా, ఈ పార్టీలన్నీ కలిపి చేసిన రూ.669 కోట్ల వ్యయంలో దాని వాటా 16.26%గా తేలినట్లు ఏడీఆర్ తెలిపింది. 19 పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 50% (రూ.312 కోట్లు) ఎలక్టొరల్ బాండ్ల ద్వారా వచ్చినట్లు పేర్కొంది. 2019-20లో మొత్తం రూ.3,429 కోట్ల ఎలక్టొరల్ బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకున్నాయని, అందులో ఇప్పుడు లెక్కలు సమర్పించిన పార్టీల ఖాతాలకు రూ.312 కోట్లు వెళ్లిందని, ఇంకా లెక్కలు సమర్పించని పార్టీల ఖాతాలకు రూ.3117 కోట్లు వెళ్లినట్లు దీన్నిబట్టి తెలుస్తోందని ఏడీఆర్ పేర్కొంది.
ఇదీ చదవండి: