Polavaram water use for cultivation in Godavari districts: ఉభయగోదావరి జిల్లాల్లో రబీ పంట సాగుకు పోలవరం ప్రాజెక్టులోని నీళ్లను వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పోలవరం నీరు తొలిసారిగా సాగుకు వాడుకున్నట్లు అవుతుంది. రబీకి గోదావరి డెల్టాలో 8.96 లక్షల ఎకరాలకు నీరు అవసరం. నీటి కొరత వల్ల ఆయకట్టు 4 లక్షల ఎకరాలకు తగ్గించాలని జలవనరులశాఖ తొలుత ప్రతిపాదించింది. కానీ, ఖరీఫ్‌లో వర్షాలకు పంటలు నష్టపోవడంతో ఇప్పుడు పూర్తి ఆయకట్టుకు నీరివ్వాలని రైతులు, ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. దీంతో నీటిపారుదల సలహా మండలి సమావేశం కూడా రబీకి పూర్తి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటి ప్రణాళికపై జలవనరులశాఖ దృష్టి సారించింది.
పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావడంతో స్పిల్ వే క్రెస్టు స్థాయి వరకు 23 టీఎంసీల నీరు ఉంటుందని అధికారులు లెక్కలు వేశారు. అందులో 7 టీఎంసీలు డెడ్ స్టోరేజీ పోను 16 టీఎంసీలు వినియోగించుకోవచ్చని జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మార్చి 31 వరకు ఆ నీటిని అలాగే ఉంచి రబీకి వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రబీ సాగుకు రెండు రోజుల కిందట నీటి సరఫరా ప్రారంభించారు. రబీ అవసరాలకు సీలేరు నుంచీ 35 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చని అంచనా. తొలుత పోలవరం నీళ్లు వాడుకుంటూ సీలేరులో విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయాలనేది మరో ప్రణాళిక. పోలవరం నీటి వినియోగం పూర్తయ్యాక ఫిబ్రవరి, మార్చిలో సీలేరులో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని రబీ సాగుకు తీసుకోవాలని ప్రతిపాదించారు.
అవసరమైతే బలిమెల నుంచీ.. గోదావరిలో సహజ ప్రవాహాలు 32 టీఎంసీలు, సీలేరు నీళ్లు 35 టీఎంసీలు, పోలవరం నీళ్లు 16 టీఎంసీలు రబీకి అందుబాటులో ఉంటాయని జలవనరులశాఖ లెక్క కట్టింది. అన్నీ పోనూ ఇంకా అవసరమైతే బలిమెల నుంచీ నీటిని తీసుకునేందుకు ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని మంత్రులు పేర్కొన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: