Polavaram on CM Jagan: అవరోధాలన్నింటినీ దాటుకుని 2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కేంద్ర జల సంఘం డిజైన్లు ఖరారు కాగానే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని, డిజైన్లు ఖరారు చేయిస్తానని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట ఇచ్చారని చెప్పారు. శాసనసభలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చేపట్టిన చర్చలో జగన్ మాట్లాడారు. ప్రాజెక్టును ప్రారంభించాక... 2014 నుంచి చంద్రబాబు హయాంలో ఏం జరిగింది? ఈ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనే అంశాలపై వివరణ ఇచ్చారు. చంద్రబాబు తీరువల్లే నిర్మాణపరంగా, నిధులపరంగా అనేక సమస్యలెదుర్కొంటున్నామని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎదురవుతున్న సవాలు మనిషి సృష్టించిన ఉత్పాతం (మ్యాన్ మేడ్ డిజాస్టర్). తానొక మేధావినని, విజనరీనని అనుకునే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలవల్లే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అనేక విషమ పరిస్థితుల మధ్య పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్నామని జగన్ అన్నారు.
నాన్న (వైఎస్ రాజశేఖరరెడ్డి) స్వప్నం ఈ ప్రాజెక్టు. ఆయన కుమారుడిగా నేనే దీన్ని పూర్తి చేస్తా. అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రాజెక్టును ఆయనకు అంకితమిస్తాం. ఈ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాం, స్పిల్ వే నిర్మాణం పూర్తి చేశాం. గోదావరి నదిని స్పిల్‌వే మీదుగా మళ్లించాం. మూడో గ్యాప్‌లో కాంక్రీటు డ్యాం నిర్మించాం. అప్రోచ్ ఛానల్ రక్షణ స్థాయికి తీసుకొచ్చాం. స్పిల్ ఛానల్ పూర్తి చేశాం. ఎడమ కాలువ అనుసంధానం కొనసాగుతోంది. టన్నెల్ పూర్తయింది. హైడల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. - సీఎం జగన్
కేంద్రం రూ.29వేల కోట్లే ఇస్తామంటోంది
‘పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసానూ కేంద్రమే భరించాలి. కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు పోలవరం నిర్మాణాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. 2014 నుంచి 2017 దాకా పనులను గాలికి వదిలేశారు. ప్యాకేజీ ప్రకటన సమయంలో 2013-14 ధరల ప్రకారం నాటికి ఉన్న నీటి పారుదల విభాగం కింద అయ్యే వ్యయాన్నిస్తే చాలని చంద్రబాబు అంగీకరించారు. అంతకుముందు ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం, 1.4.2014 తర్వాత పెరిగే వ్యయాన్నీ కేంద్రం ఇవ్వబోనంది. కేంద్ర మంత్రిమండలి నోట్‌లో ఆ విషయం ఉంది. అప్పట్లోనే శాసనసభలో ఈ విషయం ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తే నాడు నా నోరు నొక్కేశారు. నాటి ధరల ప్రకారం అన్ని విభాగాలకూ కలిపి రూ.29,027 కోట్లే ఇస్తానని కేంద్రం అంటోంది. అంత మొత్తానికే చంద్రబాబు అంగీకరించారు కనుకనే అంతకుమించి ఇవ్వబోమని కేంద్రం చెబుతోంది. చంద్రబాబు ఎవరు అంగీకరించడానికి అని మేం ప్రశ్నిస్తున్నాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. రూ.55,656 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్రం ఒత్తిడి చేస్తోంది’ అని జగన్ చెప్పారు.
ప్రాధాన్య క్రమంలో పనులు...
చంద్రబాబు ఏ రోజూ పునరావాసం గురించి పట్టించుకోలేదు. ఆ సంగతి వదిలేసి కాఫర్ డ్యాం ప్రారంభించేశారు. ఒకవేళ దాన్ని పూర్తి చేసి ఉంటే ముంపు తలెత్తేది. మా ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్య క్రమంలో అన్ని పనులూ చేస్తున్నాం. ఎగువ కాఫర్ డ్యాం పూర్తి చేసినందున ఆ మేరకు నీళ్లు నిలుస్తాయి. 20,496 కుటుంబాలను తొలిదశలో తరలించాలని లెక్కేస్తే అందులో 3,228 కుటుంబాలు వన్‌టైం సెటిల్‌మెంట్ కోరుకున్నాయి. మిగిలిన 17,268 కుటుంబాలకు సంబంధించి 11,984 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 5,284 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. 2022 ఆగస్టు నాటికి 20,496 కుటుంబాల తరలింపు పూర్తి చేస్తాం’ అని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబే ఎత్తు తగ్గుతున్నారు...
‘పోలవరంలో డ్యాం ఎత్తు తగ్గిస్తామని ఎవరు చెప్పారు? ప్రజల్లో ఆందోళన సృష్టించేందుకు మీడియా ఇష్టమొచ్చినట్లు రాస్తోంది. పోలవరం ఎత్తు ఒక అంగుళం కూడా తగ్గదు అని చెబుతున్నా. పోలవరం ఎత్తు ఎలాగూ తగ్గదు కానీ, ప్రతి ఎన్నికకూ చంద్రబాబు ఎత్తు తగ్గుతున్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనూ ఓడిపోయి ఆయన మరుగుజ్జు అవుతారు. 2019 నాటికి, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న తేడాపై శాసనసభలో వీడియోలు ప్రదర్శించి చూపారు. అప్పట్లో ఆ మాత్రం నిర్మించినందుకే చంద్రబాబు రూ.100 కోట్లు పెట్టి బస్సులు ఏర్పాటు చేసి పోలవరం పనుల్ని అందరికీ చూపించారని, భజనలు చేయించుకున్నారని జగన్ విమర్శించారు.
2017 దాకా డీపీఆర్ ఎందుకు ఇవ్వలేదు
అంతకుముందు పోలవరంపై చర్చ ప్రారంభిస్తూ... జల వనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ మాట్లాడారు. 2014 నుంచి 2017 వరకు ఈ ప్రాజెక్టును పట్టించుకోనిది చంద్రబాబు కాదా?.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సవరించిన అంచనాల ప్రకారం ఎంత వ్యయం అవుతుందో వివరాలు సమర్పించాలని కోరితే ఆలస్యం చేసింది వారి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. 2018లో ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖలో ప్రాజెక్టు నిర్మాణం 53 శాతం పూర్తయిందని, రూ.7,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారని, అంటే వందశాతం పూర్తికి ఎంత ఖర్చవుతుందో చెప్పినట్లే కదా అని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక పోలవరం రివర్స్ టెండర్లలో రూ.830 కోట్లు ఆదా చేశామని మంత్రి తెలిపారు. చర్చలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడారు.
2020 వరదలకు డయాఫ్రం వాల్‌కు నష్టం...
ఒక ప్రాజెక్టును కట్టే క్రమంలో మొదట స్పిల్‌వే నిర్మిస్తారు. ఆ తర్వాతే ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం నిర్మించి తర్వాత ప్రధాన డ్యాం కడతారు. పోలవరంలో కొంత స్పిల్‌వే నిర్మించి, కొంతమేర కాఫర్ డ్యాంలు కట్టి వదిలేయడంవల్ల మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఏర్పడింది. 2020లో గోదావరికి భారీ వరద వచ్చి 10 లక్షల నుంచి 25 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించింది. కాఫర్ డ్యాంల వద్ద అటూఇటూ 400 మీటర్ల మేర వదిలేసిన ప్రాంతంలోనే నీరు ప్రవహించాల్సి వచ్చింది. సెకనుకు 13.5 మీటర్ల వేగంతో అంత వరద ప్రవహించడంతో డయాఫ్రం వాల్ నిర్మించిన చోట అటూ, ఇటూ ధ్వంసమైంది. ఇక్కడ పునాది కన్నా దిగువన 12 మీటర్ల నుంచి దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట మొదటి గ్యాప్‌లో 30 మీటర్ల లోతులో గుంత ఏర్పడింది. రెండో గ్యాప్‌లో 36.5 మీటర్ల లోతులో మరో గుంత పడింది. ఇదీ చంద్రబాబు విజన్ ఫలితం. ఈ సమస్యను సరిదిద్దడానికి మల్లగుల్లాలు పడుతున్నాం. ఇవేవీ మీడియాకు కనిపించవా? కేంద్రమంత్రి షెకావత్ వచ్చి ఇదంతా చూసి వెళ్లారు. మార్చి ఆఖరులోగా ఈ గుంతల సమస్య పరిష్కరించేలా డిజైన్లు ఖరారు చేయిస్తామన్నారు’ అని సీఎం తెలిపారు.
ఇదీ చదవండి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇసుక వివాదం.. డయాఫ్రం వాల్ పనులకు ఆటంకం