సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఆరా తీశారు(pm Modi Phone Call to cm jagan news). వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల పరిస్థితి ముఖ్యమంత్రి వివరించారు(heavy rains in andhrapradesh). కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు.. వరద ప్రాంతాల్లోని చర్యలను ప్రధానికి నివేదించారు.సహాయ చర్యలకు నేవీ హెలికాప్టర్లు వాడుకుంటున్నామని వివరించారు. వరద సహాయ చర్యల్లో కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని సూచించారు.
ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం ఏరియల్ సర్వే
రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు(cm jagan aerial survey news). కడప, చిత్తూరు, నెల్లూరు సహా ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిస్థితి సమీక్షిస్తారు. ఈ మేరకు శనివారం గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు చేరుకోనున్న ముఖ్యమంత్రి.. హెలికాప్టర్ ద్వారా వరద ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్ సర్వేకు ముందు కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ చేపట్టనున్నారు.
భారీ వర్షాలు - జనజీవనం అస్తవ్యస్తం
గత రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. చిత్తూరు జిల్లా తిరుపతి, తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను తితిదే మూసేసింది. నిన్నంతా కురిసిన భారీ వర్షానికి శ్రీవారి మెట్ల మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది.
భారీగా ప్రాణ నష్టం..
భారీ వర్షాలు, వరదల దాటికి కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. దాదాపు 30 మంది వరదనీటిలో కొట్టుకు పోగా ఇప్పటి వరకు 12 మృతదేహాలు వెలికితీశారు. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని కండక్టర్, ఇద్దరు ప్రయాణికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వరద ఉద్ధృతికి జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. దీంతో చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మండపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నందలూరు వద్ద ఆర్టీసీ బస్సులో 3 మృతదేహాలను వెలికితీశారు. గండ్లూరు శివాలయం సమీపంలో 7, రాయవరంలో 3 మృతదేహాలు వెలికితీశారు. 30మంది వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నా.. స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి