Piyush goyal: ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచీ బియ్యం, వడ్ల సేకరణను నిలిపేయాల్సి వస్తుందని కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌గోయల్ హెచ్చరించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో పీఎంజీకేఏవై 6వ దశ కింద ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ దశ కింద 8.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించాం. ఏ రాష్ట్రమైనా ఈ కేంద్ర పథకాన్ని అమలు చేయకపోతే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది...’ అని ఆయన బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు గత అయిదు విడతల్లో 23,75,496 మెట్రిక్ టన్నులు అందించామని బుధవారం లోక్‌సభలో తెదేపా ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇప్పటివరకూ ఉచిత బియ్యం పంపిణీ చేయని విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు తమ వద్ద తగినన్ని నిల్వలున్నాయని, కొన్ని నిర్దిష్టమైన సమస్యల కారణంగా పంపిణీ ఆలస్యమైందని చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పుడు వీటి పంపిణికీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిందన్నారు.
ఇవీ చదవండి: