పెట్రోలు, డీజిల్ ధరలు పెంచినా ఆదాయం పెరగనందున రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆయా ధరలను సవరించింది. 2020 జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలుపై 31 శాతం పన్ను 2 రూపాయల స్థిర ధర... డీజిల్‌పై 22.25 శాతం పన్ను 2 రూపాయల స్థిర ధర కలిపి వసూలు చేసేది. జనవరి 29న పెట్రోలుపై పన్ను 35.20 శాతం, డీజిల్‌పై పన్ను 27శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏటా 500కోట్ల ఆదాయం..!
పెట్రోలు, డీజిల్‌పై 2 రూపాయలు ఉన్న స్థిర ధరను తొలగించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినందున రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచినా ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. పన్ను శాతాన్ని పెట్రోలు డీజిల్ మూలధర ఆధారంగా లెక్కిస్తారు. అది తగ్గినందున పన్ను శాతం మారినా ప్రభుత్వానికి ఆదాయంలో పెరుగుదల లేదు. 2 రూపాయల స్థిరధర తొలగించి, పన్ను పెంచడం వల్ల నికరంగా లీటరు పెట్రోలుపై 4 పైసలు, లీటరు డీజిల్‌పై 30 పైసలు ధర పెరిగింది. ప్రయోజనం లేదనుకున్న ప్రభుత్వం తొలగించిన స్థిరధరను ఇప్పుడు మళ్లీ ప్రవేశపెట్టడం సహా... మరింత పెంచింది. పెంచిన పన్ను శాతాన్ని మళ్లీ యథాపూర్వక స్థితికి తీసుకొచ్చింది. స్థిరధరను మాత్రం పెట్రోలుపై లీటరులుకు 2 రూపాయల 76 పైసలుగా డీజిల్‌పై 3 రూపాయల 7 పైసలుగా నిర్ణయించింది. దీనివల్ల జనవరితో పోలిస్తే పెట్రోలుపై లీటరుకు 76 పైసలు, డీజిల్‌పై రూపాయి 7 పైసలు ధర పెరుగుతోంది. ఫిబ్రవరి ధరలతో పోలిస్తే.. లీటరుకు 72 పైసలు, డీజిల్‌పై లీటరుకు 77 పైసల ధర పెరగనుంది. పెట్రోలు, డీజిల్ విక్రయాలపై వసూలు చేసే పన్నులో తాజాగా చేసిన సవరణల వల్ల ప్రభుత్వానికి ఏటా 500 కోట్ల వరకూ ఆదాయం పెరుగుతుందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాల అంచనా.
ధరల పెంపు సరికాదు: తెదేపా
పెట్రోలు, డీజిల్ ధరలు నెలలో రెండుసార్లు పెంచి గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడంపై ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెదేపా డిమాండ్ చేసింది. గత నెలలోనే వ్యాట్‌లో సవరణలు చేసి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, అది మరవక ముందే మరోసారి పెట్రోల్ ధరలు పెంచడం సరికాదని ఆ పార్టీ నేత కె.ఇ. కృష్ణమూర్తి మండిపడ్డారు. ధరలు పెంచి ప్రజలపై భారం మోపడమే పాలనలా మారిందని విమర్శించారు. మాటలను మార్చడంలో ఘనుడు జగన్ అని మరోసారి రుజువయిందన్నారు. పెంచిన పెట్రోలు, డీజిలు ధరలు తక్షణం తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటానికి తెదేపా సిద్ధమని హెచ్చరించారు.