రాజధాని వ్యాజ్యాలపై విచారణ నవంబర్ 15వ తేదీకి వాయిదా పడింది. కరోనా తీవ్రత దష్ట్యా భౌతిక విచారణకు ఇబ్బందులు ఉన్నందున వాయిదా వేయాలన్న న్యాయవాదుల అభ్యర్థన మేరకు.. హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి మాత్రం వాయిదాలకు అవకాశం ఉండదని.. కచ్చితంగా విచారణ చేపడతామని స్పష్టంచేసింది.
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ మరోమారు వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.కే.గోస్వామి, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగానే.. రాజధాని కేసుల విచారణను వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో వాజ్యాలు దాఖలు చేసిన వారి తరఫున అమెరికాలోని న్యాయవాదులు కూడా పాల్గొనాల్సి ఉండటం, దేశంలో కేసుల తీవ్రత దృష్ట్యా సుప్రీంకోర్టు న్యాయవాదులు భౌతికంగా హైకోర్టుకు హాజరయ్యే పరిస్థితులు లేనందున.. తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
రాబోయే నాలుగైదు వారాలు అత్యంత కీలకమని కేంద్ర వైద్యఆరోగ్య శాఖ గుర్తుచేసిన విషయాన్ని న్యాయవాదులు ప్రస్తావించారు. రాష్ట్రంలోనూ రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండటం, రాత్రి 11గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లేనందున.. ధర్మాసనం ఓ నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో నవంబర్ 15కు రాజధాని కేసుల విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాల రద్దును సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు, పెద్దసంఖ్యలో పౌరులు హైకోర్టులో వాజ్యాలు వేశారు. మార్చి 26న మొదటిసారి విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. మే మూడో తేదీకి వాయిదా వేసింది. అప్పట్లో కొవిడ్ దృష్ట్యా న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఆగస్టు 23న తదుపరి విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు మరోసారి కరోనా పరిస్థితుల్లో భౌతిక విచారణ కష్టమన్న న్యాయవాదుల వినతితో... నవంబర్ 15కు వాయిదా వేసింది.