పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై.... హైబ్రిడ్ విధానం ద్వారా నిన్నటి నుంచి విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ల తరఫున వాదించిన శ్యాం దివాన్.. 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం.. అమరావతికి భూములిచ్చిన రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. భూములు తీసుకునేటప్పుడు... నిర్దిష్ట సమయంలో రాజధానిని నిర్మిస్తామన్నారని... ఆ ప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
3 రాజధానుల ఏర్పాటుకు గల ప్రత్యేక కారణాలను ప్రభుత్వం చూపలేకపోయిందని శ్యాం దివాన్ అన్నారు. విభజన చట్టం ప్రకారం.. రాజధానిలో సచివాలయం, హైకోర్టు వంటి విషయాల్లో కేంద్రం ఆర్థిక సాయం చేయాలని ఉన్నట్లు తెలిపారు. విభజన చట్టంలో ఒక రాజధాని గురించి ఉందే తప్ప.. మూడింటి గురించి లేదని కోర్టుకు వివరించారు. కేంద్రం ఇచ్చే నిధులు వద్దనుకుని రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయం తీసుకోవచ్చా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. రాజధాని ఒకటేనని.. ఓసారి నిర్ణయం తీసుకున్నాక.. దానిని మార్చడానికి వీల్లేదని శ్యాం దివాన్ వాదించారు. ప్రభుత్వాలు మారినపుడల్లా రాజధాని మార్పు సరికాదన్న ఆయన.. మరోసారి నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర సర్కార్‌కు ఉండదని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పందమూ చేసుకుందని గుర్తుచేశారు.
నాటి ప్రభుత్వం.... వెలగపూడిలో 27 ఎకరాల్లో 526 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనంలోనే మంత్రులు, అధికారులు కార్యకలాపాలు మొదలుపెట్టారని శ్యాం దివాన్ పేర్కొన్నారు. 2 వేల 209 కోట్ల రూపాయలతో 3 వేల 840 నివాస గృహాల నిర్మాణాలను చేపట్టారని వివరించారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం చాలనందున.. విచారణను ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: చిన్నారిని తీసుకెళ్లిన పోలీసులు..ఆగిన తల్లి గుండె