తెలంగాణలోని చటాన్‌పల్లి వద్ద హత్యాచారానికి గురైన ‘దిశ’ తల్లిదండ్రులకు జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నుంచి పిలుపొచ్చింది. వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ వారిని కోరింది. కేసు విచారణలో భాగంగా దిశ తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను తెలంగాణ పోలీస్ అకాడమీకి తీసుకెళ్లేందుకు పోలీసులు శంషాబాద్‌లోని ఇంటికి వెళ్లారు. దిశ పెద్దకర్మ రోజున విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని తొలుత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె తల్లి ఆరోగ్యం సహకరించడం లేదని.. ఇబ్బంది పెట్టొద్దని పోలీసులను కోరారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీరుకు నిరసనగా దిశ నివాసం వద్ద కాలనీవాసులు ఆందోళకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంతసేపటికి పోలీసులు ఒప్పించడం వల్ల దిశ తండ్రి, సోదరి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రత్యేక వాహనంలో విచారణకు బయల్దేరారు.
మరోవైపు నిందితుల చేతిలో గాయాలపాలైన ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌ను కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం ప్రశ్నించే అవకాశముంది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి వెళ్లి వారిని విచారించనున్నట్లు సమాచారం.