నయీమ్ కేసు దర్యాప్తును వేగవంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని.. సుపరిపాలనా వేదిక అధ్యక్షుడు పద్మనాభరెడ్డి... తెలంగాణ గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ఆశించిన స్థాయిలో లేదని.. ఆయన లేఖలో పేర్కొన్నారు.
నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో... అధికారులు 130 డైరీలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం.. సుపరిపాలనా వేదిక కార్యదర్శికి రాసిన లేఖలో వివరించారు. డైరీలను విశ్లేషించి.. అతనికి ఏయే రాజకీయ నాయకులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో సంబంధాలున్నాయనేది బయటపెట్టాలని పద్మనాభరెడ్డి కోరారు.
కేసు పురోగతి, ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాల గురించి తెలపాలని సుపరిపాలనా వేదిక.. సమాచార హక్కు చట్టం కింద.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి దరఖాస్తు చేసింది. నయీమ్ ఇంట్లో 25 తుపాకులు, 3 ఏకే 47లు, పేలుడు పదార్థాల సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం చెప్పింది. దీనితో నయీమ్కు ఉగ్రవాదులతోనూ సంబంధాలుండేవన్న అనుమానాలు తలెత్తుతున్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు.
2.16కోట్ల రూపాయలు.. 1.9కిలోల బంగారం... 2.4 కిలోల వెండి.. 21 కార్లు, ఇతర వాహనాలు.. 26 ద్విచక్ర వాహనాలు నయీమ్ వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేల ఎకరాలకు సంబంధించిన 752 రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు.. ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనేది తేల్చాలని పద్మనాభరెడ్డి కోరారు.
ఇదీ చూడండి