కనీస గౌరవ వేతన కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ నర్సులు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి ఒప్పంద పద్ధతిలోనే ఉద్యోగాలు చేస్తున్నా.. వృత్తిరీత్యా ఎదుగుదల లేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
విజయనగరంలో..
విజయనగరం జిల్లా కురుపాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఒప్పంద స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ ఉద్యోగాల క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలోనూ కుటుంబాలకు దూరంగా సేవలందించిన తమను ఎవరూ గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీజీ విగ్రహానికి తమ వినతిపత్రం అందించారు. విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నర్సులు నిరసనకు దిగారు.
గుంటూరులో..
గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఎదుట ఒప్పంద స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు. పదిరోజులుగా నిరసన చేస్తున్నా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే దాకా అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నామన్నారు. అవసరమైతే ఆ సేవలనూ నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ప్రకాశంలో..
పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట నర్సులు ధర్నా నిర్వహించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన నర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు తీర్చాలని అన్నారు.
అనంతపురంలో..
అనంతపురంలో ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ నర్సులు ఆందోళనకు దిగారు. కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్న ప్రతి స్టాఫ్ నర్స్‌కు 50లక్షల బీమా చేయించాలని డిమాండ్ చేశారు.
విశాఖలో..
విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద హౌసింగ్ స్టాఫ్ నర్సులు నిరసనకు దిగారు. కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్నవారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని అన్నారు.
పశ్చిమ గోదావరిలో..
ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేశారు. ఏలూరులోని ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహం వద్ద నివాళులర్పించి నిరసనను ప్రారంభించారు. కొవిడ్ విధులు నిర్వహిస్తూ చనిపోయిన స్టాఫ్ నర్సులకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫైర్ స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చదవండి:
RDS Controversy: ఆర్‌డీఎస్ కుడికాలువ నిర్మాణం సక్రమమే: మంత్రి అనిల్