ఇద్దరు సీఎంల నాటకమే ఇది
పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాల తరలింపు అంశంపై కేసీఆర్, జగన్ కలసి నాటకాలాడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. తెదేపా తెలంగాణ నేతలతో జూమ్ ద్వారా చంద్రబాబు మాట్లాడారు. ‘ఇంతకాలం మిత్రులం అని మాట్లాడిన జగన్, కేసీఆర్‌లు ఇప్పుడు కరోనా నియంత్రణలో విఫలమై దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే పోతిరెడ్డిపాడు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయమైనా రెండు రాష్ట్రాలకు మేలుచేసేలా, అభివృద్ధి జరిగేందుకు దోహదపడేలా ఉండాలి. ఈ అంశంపై రెండు ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్తాయో మరో నాలుగైదు రోజులు వేచి చూసి ఒక నిర్ణయానికి వద్దాం. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించి, వేతనం పెంచాలని తెదేపా శ్రేణులు పోరాడాలి’ అని చంద్రబాబు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ వివరించారు.
ఆ ప్రాజెక్టులు పూర్తయితే ఏపీ ఎడారే
తెలంగాణ కృష్ణా నదిపై అక్రమంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటిపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆ అక్రమ ప్రాజెక్టులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందన్నారు. తెరాస ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 90 టీఎంసీలను మళ్లించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, 30 టీఎంసీలను ఎత్తిపోసేందుకు డిండి పథకం పనులను శరవేగంగా చేస్తోందన్నారు. ఈ రెండూ కొత్త ప్రాజెక్టులని, వాటికి బచావత్ లేదా బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ నీటిని కేటాయించలేదన్నారు. ఇవి పూర్తయితే ఏపీలోని తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టాకు నీటి కొరత ఏర్పడుతుందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ఇదే అంశంపై కర్నూలులో జలదీక్ష చేపట్టారని, ఇపుడు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. వెంటనే ఈ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయించాలని డిమాండ్ చేశారు.
న్యాయపోరాటం చేసైనా సీమకు నీళ్లివ్వాలి
తెలంగాణ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసైనా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గుంటూరు నగర శివారు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీచైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబుతో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కృష్ణా మిగులు జలాలను పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు తరలించాలనేది వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశయమన్నారు. జీవో 203 విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కు తగ్గవద్దని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి వాల్మీకి కోరారు.
ఎక్కువ జలాలను వినియోగించుకోవాలి
కృష్ణా జలాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ కోరారు. కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఉమ్మడి కృషి కొనసాగించేలా ప్రభుత్వం చొరవ చూపాలని సూచించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వీలైనంత ఎక్కువ కృష్ణా జలాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిద్ధేశ్వరం నుంచి మూడు టీఎంసీల నీటిని తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 203 జీవో తీసుకురావడం అభినందనీయమని మాజీ మంత్రి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి కడపలో అన్నారు.
తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవు
ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుపై తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవని, జీవో 203పై ఆ రాష్ట్రం మూర్ఖంగా వ్యవహరిస్తోందని రాజ్యసభ సభ్యుడు, భాజపా నాయకుడు టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడూతూ జీవో 203పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెనక్కి తగ్గవద్దని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి భాజపా తరఫున విన్నవిస్తామని తెలిపారు. రాయలసీమ కరవు తనకు తెలుసునని, నివారణకు కృషి చేస్తామని చెప్పిన తన వాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ మరచిపోకూడదన్నారు.
ఏపీ జీవోపై తెలంగాణ పార్టీల నిరసన
శ్రీశైలం నుంచి నీటి తరలింపునకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై తెలంగాణ రాజకీయ పార్టీలు నిరసన వ్యక్తంచేశాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ వల్ల పూర్వ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశాయి. సాగర్‌కు నీళ్లు రావని ఆందోళన చెందాయి. ఏపీ ప్రభుత్వం పనులు ప్రారంభించిన రోజునే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేయగా... ఈ జీవో విషయమై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశానని భాజపా అధ్యక్షుడు బండిసంజయ్ తెలిపారు. జూరాలపై మరో ఎత్తిపోతల నిర్మించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కోదండరాం కోరారు. ఏపీ చర్యలను చూస్తూ ఊరుకోబోమని మంత్రి అజయ్ మాట్లాడగా.. కాంగ్రెస్, భాజపాలకు చిత్తశుద్ధి ఉంటే పార్టీల వైఖరి చెప్పాలని తెరాస నేత కర్నె ప్రభాకర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పోతిరెడ్డిపాడుపై కేంద్ర మంత్రి స్పందన