July 2nd in Hyderabad: రానున్న మూడు రోజులు తెలంగాణలోని హైదరాబాద్లో రాజకీయ వాతావరణం.. మరింత వేడక్కనుంది. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ సమావేశాల కారణంగా.. దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది. ఇదిలా ఉండగా.. జులై 2 మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ.. జులై 2న నగరానికి వస్తుండగా.. అదే రోజున విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన ఉండటంతో.. హైదరాబాద్లో రాజకీయపరిణామాలు రసవత్తరంగా మారనున్నాయి.
జులై 2న హైదరాబాద్ రానున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనపై నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సిన్హాకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి ఎవరు వెళ్లాలి..? ఎలా స్వాగతం పలకాలి..? అనే విషయాలపై చర్చించారు. విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు కేటీఆర్ తెలిపారు.
జులై 2న ఉదయం 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి యశ్వంత్ సిన్హా చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు జలవిహార్లో యశ్వంత్ సిన్హాకు మద్దతుగా తెరాస సభ నిర్వహించనున్నారు. సభ తర్వాత.. సీఎం కేసీఆర్, తెరాస నేతలతో కలిసి సిన్హా భోజనం చేస్తారు. అదే రోజున భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్రమోదీ కూడా హైదరాబాద్ రానుండటంతో యశ్వంత్ సిన్హా కార్యక్రమంపై తెరాస ప్రత్యేక దృష్టి సారించింది. అటు పోలీసులు కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇవీ చూడండి: