కొవిడ్ ఆంక్షలను దశలవారీగా సడలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ అటెండెన్సు తప్పనిసరి చేసినా సచివాలయంలో గైర్హాజరవుతున్న వారి సంఖ్య 30 శాతంగా ఉంటోంది. మొత్తం 41 శాఖలు, ఉప విభాగాలకు సంబంధించి సచివాలయంలో ఉన్న 2 వేల 48 మంది ఉద్యోగుల్లో 11 గంటల సమయానికి కూడా కేవలం 1427 మంది మాత్రమే హాజరైనట్టు బయోమెట్రిక్ అటెండెన్సు వివరాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా 606 మంది గైర్హాజరయ్యారని సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది. దీంతో మొత్తంగా హాజరైన ఉద్యోగుల శాతం 70 శాతంగా నమోదైంది. మిగతా 30 శాతం మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరైనట్టుగా నమోదు చేశారు.
విభాగాల వారీగా సాధారణ పరిపాలన శాఖలో 93 శాతం మంది ఉద్యోగులు, ప్రణాళిక విభాగంలో 90 శాతం మంది, పౌరసరఫరాల శాఖలో 90 శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఒక్కరు కూడా సచివాలయానికి రాలేదు. సీఎంఓలో పనిచేసే ఉద్యోగుల్లో 30 శాతం మాత్రమే సచివాలయంలో విధులకు హాజరయ్యారు. వెనుకబడిన తరగతులు, ఉన్నత విద్యాశాఖల్లో 50 శాతం కంటే తక్కువ హాజరు నమోదైంది.
ఇదీ చూడండి: FACEBOOK FRIENDSHIP: ప్రాణం మీదకు తెచ్చిన ఫేస్‌బుక్ పరిచయం