Omicron cases in Telangana: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. కెన్యా నుంచి వచ్చిన మహిళను టోలిచౌకిలో గుర్తించామని.. ఆమెను చికిత్స నిమిత్తం గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. సోమాలియాకు చెందిన వ్యక్తిని గుర్తించాల్సి ఉందని.. అతని చిరునామా తెలియగానే ఐసోలేషన్‌కు తరలిస్తామని వివరించారు. తెలంగాణ, హైదరాబాద్ స్థానికులకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదన్న డీహెచ్.. ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జీనోమ్ సీక్వెన్సింగ్‌లో నిర్ధరణ
'రాష్ట్రంలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ ఇద్దరూ ఈ నెల 12న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధరణ అయింది. మహిళను ప్రస్తుతం చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించాం. సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తి చిరునామా గుర్తించాల్సి ఉంది.' -శ్రీనివాస్ రావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు
అప్రమత్తత అవసరం
Omicron cases: మూడో వ్యక్తి బంగాల్‌కు చెందిన వారని.. ఆయనను రాష్ట్రంలోకి రానివ్వకుండా విమానాశ్రయం నుంచి నేరుగా బంగాల్ పంపించినట్లు డీహెచ్ చెప్పారు. అక్కడి అధికారులకు సమాచారం అందించినట్లు వివరించారు. ఒమిక్రాన్‌ను కొవిడ్ నియమాలతో నియంత్రించవచ్చని.. వ్యాక్సిన్ వేసుకున్నా అప్రమత్తత అవసరమని డీహెచ్ సూచించారు. ఒమిక్రాన్ కేసులతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైందని.. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు.
వదంతులు నమ్మొద్దు
'ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రజలు వదంతులు నమ్మవద్దు. అసత్య ప్రచారాలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒమిక్రాన్ కూడా గాలి ద్వారానే సోకుతుంది. విదేశాల నుంచి రాష్ట్రానికి 5.396 మంది వచ్చారు. పండుగలు, ఫంక్షన్లు కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలి. ఒమిక్రాన్ కట్టడిపై సీఎం ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు.' -శ్రీనివాస్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు
ఇదీ చదవండి..