veterinary students: కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని N.T.R వెటర్నరీ కళాశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కళాశాల ఆవరణలో నిరవధిక సమ్మెకు దిగారు. పశువైద్య ప్రమాణాలను వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి విరుద్ధంగా.. సుమారు 10వేలకు పైగా పశుసంవర్ధక అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేశారన్నారు.
పట్టభద్రులైన వెటర్నరీ విద్యార్థులను పక్కన పెట్టి.. తాత్కాలిక కోర్సులను పూర్తి చేసిన వారిని కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రోడ్లపైకి రావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఆర్ఎల్యూలను వెటర్నరీ డిస్పెన్సరీలుగా ఉన్నతీకరించాలని, నియోజకవర్గ స్థాయి వెటర్నరీ డిస్పెన్సరీ, డయాగ్నస్టిక్ లేబరేటరీ, పశువైద్య సంచార వాహనాల్లో వెటర్నరీ డాక్టర్ని నియమించాలన్నారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్.. వీసీఎల్ రూల్స్‌కు అనుగుణంగా నెలకు రూ.14 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:మేము అధికారంలో ఉంటే.. ఈ పాటికి పోలవరం ఉరకలెత్తేది: చంద్రబాబు