Weather: మండే ఎండలంటే రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోనే.. అనే అభిప్రాయం క్రమంగా మారుతోంది. అయిదేళ్లుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా మార్చి, ఏప్రిల్‌లో గరిష్ఠంగా 44 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. మే నెలలో ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణశాఖ తెలిపింది. అయితే వర్షాలు మాత్రం సాధారణం కంటే ఎక్కువగా కురుస్తాయని పేర్కొంది. శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఈ విషయాలను స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం, పది రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల ప్రభావం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వేడి, పొడిగాలులు.. తెలంగాణ మీదుగా ఒడిశా వైపు ప్రయాణిస్తున్నాయి. దీంతో పల్నాడు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాల్పుల ప్రభావమూ ఉంది. ఈ పొడిగాలులకు.. రాత్రి సమయంలో సముద్రం నుంచి వచ్చే తడిగాలులు తోడవుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి.. వడగళ్ల వాన, ఉరుములు, పిడుగుల మోతకు కారణమవుతున్నాయని వివరించారు.
ఉత్తరాంధ్రలో ఉదయం 10 గంటలకే 38 డిగ్రీలు: రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గరిష్ఠంగా 44 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. సాధారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య 34 డిగ్రీల వరకు రికార్డు అవుతుంటాయి. అయితే వారం రోజులుగా 38 డిగ్రీల వరకు చేరుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు.. 43 డిగ్రీలకు(సాధారణంగా 36-38 డిగ్రీల మధ్య ఉండాలి) చేరుతోంది. దీంతో వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతోంది.
రాయలసీమలో 47 డిగ్రీలకు చేరే అవకాశం: ఈ నెలలో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. సాధారణంగా 27-29 మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రతలు.. ప్రస్తుతం 32 డిగ్రీలు వరకు రికార్డు అవుతున్నాయి.
దక్షిణ అండమాన్‌లో ఉపరితల ఆవర్తనం.. ఉరుములు, మెరుపులతో జల్లులు: దక్షిణ అండమాన్ సముద్రం, పరిసరాల్లో మే 4వ తేదీ నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడొచ్చు. తర్వాత 24 గంటల్లో ఇది మరింత బలపడొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మండుతున్న ఎండలు... కర్నూలులో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు