ఎక్కువ జనాభా ఉన్న మేజర్ పంచాయతీలతో పాటు శివారు గ్రామాలను కలిపి కొత్త పురపాలికలను ఏర్పాటుచేశారు . ఐతే నిధుల లేక ఆయా మున్సిపాలిటీల్లో కొద్దిస్థాయిలో సీసీరోడ్ల నిర్మాణం మినహా ఎక్కడా పెద్దగా ప్రగతికార్యక్రమాలు కనిపించక అభివృద్ధి అటకెక్కిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి పైసాలేక, స్థానికంగా నిధులు సమకూర్చుకోలేని దుస్థిలో కాలం వెళ్లదీస్తున్నాయి.
ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి గెలిచిన కౌన్సిలర్లు అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేక... ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. గోతుల రహదారులకు కనీసం మరమ్మతు చేసేందుకు యంత్రాంగం చొరవ చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
అసంపూర్తిగానే...
ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో ఉన్న ఐదు పురపాలికలకు అదనంగా... చండూరు, హాలియా, నందికొండ, నేరేడుచర్ల, భూదాన్ పోచంపల్లి, ఆలేరును నూతన మునిసిపాలిటీలు
న్సిపాల్టీలుగా చేశారు. పట్టణ ప్రగతి మినహా ఇతర నిధులేమీ రావట్లేదని పాలకవర్గాలు వాపోతున్నాయి. ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు, సీసీ రహదారులు, మురికికాల్వల నిర్మాణాలు... అరకొరగా చేపట్టారు. పూర్తిస్థాయిలో నిధుల్లేక పనులన్నీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి.
ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు...
సరైన డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ లేక వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. సమీకృత మార్కెట్లు, ఉద్యానవనాలు, ఓపెన్‌జిమ్‌లు, మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లు వంటివి కొత్త పురపాలికల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొత్త పురపాలికలకు నిధులు మంజూరు చేసి సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: సీడ్ యాక్సెస్ పక్కనే రోడ్డు తవ్వి, కంకర తరలింపు