తమిళనాడు తీరం వైపు తీవ్ర తుపాను నివర్ దూసుకు వస్తోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా నివర్ తుపాను కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. ప్రస్తుతం తమిళనాడులోని కడల్లోర్కు 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు ఐఎండీ స్పష్టం చేసింది. కొద్దీ గంటల్లో ఇది పెను తుపానుగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. ఈ రోజు రాత్రికి పెను తుపాను నివర్ పుదుచ్చేరికి సమీపంలో మామల్లపురం- కరైకల్ వద్ద తీరాన్ని దాటుతుందని స్పష్టం చేసింది.
నివర్ ప్రభావంతో ఇప్పటికే చెన్నై సహా తమిళనాడులోని కోస్తా జిల్ల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. చాలా చోట్ల 12 సెంటీ మీటర్ల మేర ఆ ప్రాంతాల్లో వర్షం పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో సైతం ఆకాశం మేఘావృతమై ఉంది. నెల్లూరు, చిత్తూరు తదితర చోట్ల వర్షాలు, గాలులు మొదలైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
తీర ప్రాంతాల్లో 65-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గాలులు వేగం గంటకు 145 కిలోమీటర్ల మేర ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది, అలల ఎత్తు దాదాపు 3-5 మీటర్ల మేర ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడుతో పాటు కోస్తాంధ్ర లోని అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కోస్తా జిల్లాలతోపాటు రాయల సీమ జిల్లాల్లో ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: