కోట్లాది మంది భారతీయుల కలం నిజం చేస్తూ... అయోధ్యలో భవ్య నవ్య రామందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వెండి ఇటుకలతో భూమి పూజ చేశారు. ఇక నాగరశైలిలో నిర్మితమవుతున్న ఈ అపూరూప అత్యద్భుత కట్టడం భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అలరారనుందనడంలో ఏసందేహం లేదు.
అద్భుత కళాకృతులకు, కాకతీయ కట్టడాలకు ఓరుగల్లు చిరునామా అనేది అందరికీ తెలిసిందే. రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి అందాలను ఎన్ని సార్లు చూసినా తనివితీరదు. ఆలయంలో చెక్కిన శిల్పాలు.. సజీవ ప్రతిమల్లా కనిపించటమే వాటి ప్రత్యేకత. పీఠం నుంచి పైనున్న శిఖరం వరకూ చేపట్టిన అద్భుత నిర్మాణ కౌశలం చూపరులను అబ్బురపరుస్తుంది. రామప్ప ఆలయ శిఖరం బరువు లేకుండా ఉండేందుకు.... నీటిలో తేలియాడే ఇటుకలను ఉపయోగించారు. సాండ్‌బాక్స్ పద్ధతిలో అంటే... పునాదుల్లో ఇసుకని నింపి ఆలయాన్ని నిర్మించారు. భూకంపం వచ్చినా ఆలయం కూలిపోదు.
అయోధ్యలో రామమందిర నిర్మాణంలో కూడా అవసరమైతే కాకతీయులు ఉపయోగించిన సాండ్ బాక్స్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలంటూ... దాని విశిష్టతను తెలియచేసేందుకు.. ఎన్ఐటీ విశ్రాంత ఆచార్యులు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు పాండురంగారావు.. మరో ఆచార్యులు వి. రమణమూర్తి నడుంబిగించారు. ఇందుకోసం ఒక నివేదికను సిద్ధం చేస్తున్నారు. వందల ఏళ్లైనా చెక్కుచెదరని సాండ్ బాక్స్ టెక్నాలజీ దాని ప్రాధాన్యతను తెలియచేస్తూ...ఆలయ నమూనాలకు సంబంధించిన చిత్రాలతో...నివేదికను సిద్ధం చేస్తున్నారు. రామాలయ నిర్మాణంలో..అవసరమైతే..కాకతీయుల నిర్మాణ శైలి, సాంకేతికతను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇవీచూడండి: అక్టోబరు 15న కళాశాలలు తెరవాలి: సీఎం జగన్