కీలక రక్షణ స్థావరాల సమాచారాన్ని శత్రుదేశ నిఘా అధికారులకు చేరవేస్తున్నారన్న అభియోగాలపై తాజాగా నమోదైన కేసులో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ఉగ్రవాద సంస్థ పేరు తెరపైకి వచ్చింది. భారత్‌లోని తూర్పు, పశ్చిమ తీరాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లోని రక్షణ స్థావరాల సమాచారం చేరవేతలో ఈ సంస్థ పాత్ర ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. ప్రత్యేక ఖలిస్థాన్ సాధనే లక్ష్యంగా ఏర్పడిన ఈ ఉగ్ర సంస్థను పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పెంచి పోషిస్తోంది. బీకేఐని అడ్డం పెట్టుకుని భారత్‌లో అలజడులు సృష్టించేందుకు కొన్నాళ్లుగా ఐఎస్‌ఐ ప్రయత్నిస్తోంది. బీకేఐ నాయకుడైన వాద్వాసింగ్ బబ్బర్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. కెనడా, జర్మనీ, యూకేతో పాటు భారత్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ సంస్థ ఉగ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజా కేసులో బీకేఐ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. దేశ భద్రత రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారంటూ మన దేశానికి చెందిన కొందరు భద్రతా సిబ్బంది, పౌరులపై ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) 2020 జనవరి 10న కేసు నమోదు చేసింది. గతేడాది అక్టోబరులో గుజరాత్‌లోని గోద్రా నగరానికి చెందిన అల్తాప్ హుస్సేన్ హురున్ ఘాంచీని అరెస్టు చేసింది. ఈ కేసు తీవ్రత, మూలాల దృష్ట్యా ఎన్‌ఐఏ తాజాగా దీనిపై ఎఫ్‌ఐఆర్‌ను రీ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టింది. బీకేఐ పాత్రను ప్రాథమికంగా గుర్తించింది. పంజాబ్ సహా ఉత్తరాదిలోనే ఉగ్ర కార్యకలాపాలకు పరిమితమైన ఈ సంస్థ ఇప్పుడు... దక్షిణాది ప్రాంతాల్లోని రక్షణ స్థావరాల వివరాలు సేకరిస్తున్న విషయం వెలుగుచూడటం చర్చనీయాంశమైంది.
పలువురు వ్యక్తుల పేర్లతో వివిధ కంపెనీలకు చెందిన భారతదేశ సిమ్ కార్డులు తీసుకుని వాటిని పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్లు, వారి ప్రతినిధులకు అల్తాప్ హుస్సేన్ హురున్ ఘాంచీ సరఫరా చేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఆ నంబర్లతో వాట్సప్ ఖాతాలు తెరిచేందుకు వారికి ఓటీపీలు పంపినట్లు తేల్చింది. ఆయా నంబర్లను ఐఎస్‌ఐ ఏజెంట్లు పాకిస్థాన్ నుంచి వినియోగించేవారని నిర్ధారణకు వచ్చింది. 2014 నుంచి 2020 మధ్య ఆరేళ్ల పాటు ఆ నంబర్లకు మన దేశంలోని బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌ల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, మరికొందరు పౌరులు... కీలక సమాచారాన్ని చేరవేసినట్లు గుర్తించింది. ఆ నంబర్లతోనే గూఢచర్యానికి పాల్పడ్డారని తేల్చింది. ఈ కేసు మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, నెల్లూరుతో పాటు గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు తేల్చింది. అధికారిక రహస్యాలను శత్రుదేశానికి చేర్చేందుకు అంతా కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని గుర్తించింది. ఈ గూఢచర్య ఆపరేషన్‌ను బీకేఐ నిర్వహించినట్లు అంచనాకు వచ్చింది. ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటికే 41 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. వాటిలో మూడు ఫోన్లు నౌకాదళ ఉద్యోగులకు సంబంధించినవే. వీటి విశ్లేషణ పూర్తయితే మరింత సమాచారం వెలుగు చూసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: Genome sequencing Lab At Vijayawada: రాష్ట్రంలో తొలి జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ సేవలు