పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారణ చేపట్టింది. కోస్గి వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో ఇంప్లిడ్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల తమకు నష్టం జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. ఇంప్లిడ్ అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అనుమతించింది.
ఈ సందర్భంగా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై తనిఖీ కమిటీ నివేదిక దాఖలు చేయకపోవడంపై ప్రశ్నించిన ఎన్జీటీ.. కమిటీ నోడల్ ఏజెన్సీగా తెలంగాణ గనుల శాఖను తొలగించి.. కేఆర్ఎంబీని నియమించింది. ప్రాజెక్టు నిర్మాణం, పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇవ్వకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఎన్జీటీ.. త్వరగా నివేదిక ఇవ్వాలని మరోసారి ఆదేశించింది.
నిపుణుల కమిటీ..
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనం గతంలో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ ఎన్జీటీలో కేసు నమోదైంది. ముదిరెడ్డిపల్లి నివాసి కోస్గి వెంకటయ్య ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు కోసం భారీగా చెరువులను తవ్వుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. ప్రధానంగా ఉదండాపూర్ రిజర్వాయర్‌కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట నిర్మాణం కోసం తవ్వుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించడం లేదని ట్రైబ్యునల్‌కు వివరించారు.
ఎన్జీటీ నోటీసులు..
పిటిషన్‌ను స్వీకరించిన బెంచ్.. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనపై కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఈ, గనుల శాఖ, మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
ఎన్జీటీ అసహనం..
పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు జరిగాయో లేదో తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సైంటిస్ట్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, నీరి సంస్థ ప్రతినిధి, గనులు, జియాలజీ శాఖ డైరెక్టర్లను ట్రైబ్యునల్ నియమించింది. ఉల్లంఘనలపై తనిఖీలు జరిపి నేడు (ఆగస్టు 27లోగా) నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. ఈరోజు కమిటీ నివేదిక ఇవ్వకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఎన్జీటీ.. త్వరగా నివేదిక ఇవ్వాలని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22కి వాయిదా వేసింది.
ఇదీచదవండి.