తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటించారు. పోలవరం ముంపు నిర్వాసితులతో సమావేశమయ్యారు. కాచవరంలో గడేసుల హరనాథ్ అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. లోకేశ్‌తో పాటు పర్యటనలో తెదేపా నేతలు దేవినేని ఉమ, చినరాజప్ప పాల్గొన్న రాజేశ్వరి, వెంకటేశ్వరరావు, జ్యోతుల నవీన్ పాల్గొన్నారు.
జిల్లా పోలవరం ముంపు మండలాలైన కూనవరం, చింతూరు, వీఆర్‌పురం మండలాల్లో భూనిర్వాసితులను నారా లోకేశ్ పరామర్శించారు. నిర్వాసితుల మండలాల్లోని ప్రజల పరిస్థితులను తెలుసుకుని వారికి పరిహారం అందేలా చేస్తామని తెలిపారు.
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న లోకేశ్
తొలుత ఆయన తెలంగాణలోని భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. లోకేశ్‌తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య తెదేపా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయిన నిర్వాసితులకు శక్తిని అందించాలని భద్రాద్రి రామయ్యను కోరుకున్నట్లు నారా లోకేశ్ తెలిపారు.
నేడు భద్రాచలం, టేకులబోరు, శ్రీరామగిరి, చింతూరులో ఆయన పర్యటిస్తారు. ఎల్లుండి రంపచోడవరం, దేవీపట్నం, పెదవేంపల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో లోకేశ్ పర్యటన కొనసాగనుంది.
ఇదీ చదవండి: Lokesh: రేపు, ఎల్లుండి పోలవరం ముంపు ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన