గుంటూరు జిల్లా మందడంలో రైతుల దీక్షకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంఘీభావం తెలిపారు. గతంలో శాసనసభలో.... ప్రతిపక్ష నేతగా జగన్ ప్రతిపాదించిన.. అమరావతి నుంచి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారని లోకేశ్ ప్రశ్నించారు. స్వలాభం కోసమే 3 రాజధానులు అంటున్నారని విమర్శించారు. వైకాపా నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నా పట్టించుకోని పోలీసులు.. తెదేపా సానుభూతిపరులను అకారణంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి వైకాపా అడుగడుగునా.. అడ్డుపడిందని ఆరోపించారు.
తెలంగాణకు తరలిపోతున్న పెట్టుబడులు
రాష్ట్ర విభజన అనంతరం కట్టుబట్టలతో వచ్చిన ఆంధ్రులకు... సొంత గడ్డ నుంచే పాలన అందించాలనే ఉద్దేశంతో రాజధానిపై సుదీర్ఘంగా చర్చించి అమరావతిని రాజధానిగా ప్రకటించామన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టవద్దని గతంలో సింగపూర్ మంత్రులకు వైకాపా నేతలు మెయిల్స్ పెట్టారని లోకేశ్ ఆరోపించారు. రాజధానిలో గ్రాఫిక్స్ అంటూ మంత్రి బొత్స పదేపదే చెబుతున్నారన్న ఆయన.. గ్రాఫిక్స్ అయితే బిల్డింగ్‌పై నుంచి దూకాలని బొత్సకు సవాల్ విసిరారు. రాష్ట్రానికి వచ్చే సంస్థలన్నింటినీ సీఎం జగన్.. తెలంగాణకు పంపిస్తున్నారని విమర్శించారు. రిలయన్స్, లులూ, సహా పలు సంస్థలు రాష్ట్రం నుంచి వెనక్కి పోయాయన్నారు.
సీఎంకు డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లాల్సిన దుస్థితి
జగన్ చెబుతోంది మూడు రాజధానులు కాదు... మూడు ముక్కల రాజధాని అని లోకేశ్ విమర్శించారు. అమరావతి అనే పసిబిడ్డను జగన్ మూడు ముక్కలుగా నరికేశారన్నారు. చినకాకాని ఆందోళన వైపు రావద్దని రైతులు ఎమ్మెల్యే పిన్నెల్లి దండం పెట్టినా కావాలనే అక్కడికి వచ్చి.. రైతులను రెచ్చగొట్టారన్నారు. వైకాపా పెయిడ్ ఆర్టిస్టులే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై దాడి చేశారన్నారు. భూములిచ్చిన రైతులపై కేసులు పెడితే.. ఎంతటికైనా పోరాడతామన్నారు. రావాలి జగన్ . . కావాలి జగన్ అన్న ప్రజలు.. ఇప్పుడు పోవాలి జగన్.. వద్దు జగన్ అంటున్నారని లోకేశ్ స్పష్టం చేశారు. డమ్మీ కాన్వాయ్‌తో సచివాలయానికి వెళ్లాల్సిన దుస్థితి సీఎం జగన్‌కు ఏర్పడిందని విమర్శించారు.
అధికారులు మూడు రాజధానులు చుట్టూ తిరగాలా..!
రాజధాని రైతులకు ప్లాట్లు ఇచ్చాకే.. ఇల్లు కుట్టుకుందామని చంద్రబాబు భావించారని లోకేశ్ చెప్పారు. అమరావతి రైతులను మోసం చేసిన జగన్... అదే పరిస్థితిని విశాఖ, కర్నూలు వాసులకు తీసుకువస్తారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రివర్స్‌లో నడుస్తుందని విమర్శించారు. మూడు రాజధానులతో వెనుకబడిన దక్షిణాఫ్రికాను సీఎం ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు పెట్టడం దారుణమన్నారు. హైకోర్టు, శాసనసభ, సచివాలయం అన్నీ ఒకే చోట ఉండాలన్నారు. అప్పుడే పాలనా పరంగా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని చెప్పారు. 3 రాజధానులు వస్తే అధికారులు జీవితాంతం మూడు రాజధానుల చుట్టూ తిరగాల్సిందేనన్నారు.
అతనిపై దిశ చట్టం కింద కేసు పెట్టండి
మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు అని జగన్ చెప్పే వరకూ పోరాడతామన్నారు. అమరావతి కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న మహిళలపై పులివెందులకు చెందిన వర రవీంద్రారెడ్డిపై పెట్టిన అసభ్య పోస్టులను... వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ వ్యక్తిపై దిశ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: