తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన నిందితుడు మృతి చెందాడు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో మూడురోజులుగా సురేశ్ చికిత్స పొందుతున్నాడు. నిన్నరాత్రి నుంచి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండగా... వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
స్వగ్రామానికి సురేశ్ మృతదేహం...
పోలీస్ బందోబస్తు నడుమ మృతదేహాన్ని గౌరెల్లికి తరలించారు. తన కొడుకు ఎప్పుడూ... తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదని సురేశ్ తండ్రి కృష్ణయ్య తెలిపారు. అసలు ఈ హత్య ఎందుకు చేశాడనేది తమకు అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మూడు ఎకరాల భూమిలోని 9 గుంటల స్థలాన్ని మల్‌రెడ్డి రాంరెడ్డికి అమ్మినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలో నిందితుడు కూడా మృతి చెందటం వల్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంధువులు ఆరోపిస్తున్నట్లు సురేష్‌ను ఈ హత్యకు ఎవరైనా ఉసిగొల్పారా... లేక ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడా... అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా మిగిలిన వివరాలు తెలుస్తాయని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.
ఇవీ చూడండి