దిల్లీలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు రహస్యంగా ఎందుకు పర్యటిస్తున్నారని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. ఆయన శనివారం ఇక్కడ తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. మంత్రులు తమ పర్యటనల ఆంతర్యాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దిల్లీలోనే మకాం వేశారు. ఆయన రాష్ట్రంలో ఆర్థిక శాఖను ఎవరికి అప్పగించారో తెలియడంలేదు. అలాగే గౌతం రెడ్డి, బొత్స సత్యనారాయణ, హోంమంత్రి సుచరిత దిల్లీకొస్తున్నారు.
వీరి వ్యవహారం చూస్తుంటే ఏదో రహస్యంగా మంత్రాంగం సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. అది వ్యక్తిగతమా.. లేదంటే ప్రభుత్వానికి సంబంధించిందా? రాష్ట్రంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితి, శాంతిభద్రతలు, ఆర్థిక వ్యవహారాల వైఫల్యం, అప్పుల అరాచకాన్ని కప్పిపుచ్చుకోవడానికి వస్తున్నారా? అన్నది తెలియడం లేదు. రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రతి విషయంలో అతిగోప్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు సమాచారం అందకుండా దాస్తున్నారు.’’ అని కనకమేడల వివరించారు.
ఇదీ చదవండి: