ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 94(3) కింద రాజధాని ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నిధులు కేటాయించాల్సి ఉందని ఎంపీ కనకమేడల గుర్తు చేశారు. కానీ ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. ఇప్పుడు ఏపీకి రాజధాని లేకుండా పోయిందంటూ.. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలని కోరారు. అమరావతి కోసం కేంద్రం ఇప్పటికే 1500 కోట్లు ఇచ్చిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక.. 7 నెలలుగా నిర్మాణాలు ఆగిపోయాయని చెప్పారు. వైకాపా సర్కారు పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటుకు నిర్ణయించిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అమరావతి కోసం 29 వేల రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు భూమిని ఇచ్చారని ఎంపీ కనకమేడల గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మూలధన లాభాల్లో రాజధాని రైతులకు కూడా మినహాయింపు ఇచ్చిందన్నారు. రాజధానిపై కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకూ ఏ బడ్జెట్లోనూ ఏపీకి సరైన నిధులు కేటాయించలేదన్నారు.
కేంద్రం అమరావతి విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. 59 రోజులుగా అమరావతి రైతులు వీధుల్లో నిరసనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అమరావతి రైల్వే లింకింగ్, విశాఖ మెట్రో ప్రాజెక్టు నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా.. ఆ దిశగా ఒక్క చర్య తీసుకోలేదన్నారు. ప్రత్యేక హోదాను వైకాపా మర్చిపోయిందని విమర్శించారు. పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలన్నారు. ప్రత్యేక హోదా అంశం కేంద్రం విచక్షణాధికారం అని 15వ ఆర్థికసంఘం పేర్కొందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు కేటాయించాలన్నారు.
ఇదీ చదవండి: