రాష్ట్ర ప్రజలను దిల్లీ కలకలం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దిల్లీలో నిర్వహించిన మత కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారు , వారితో కలిసి ప్రయాణించిన వారు 1042 మంది ఉన్నారని ప్రాథమికంగా తేలడం, వారంతా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు లాక్‌డౌన్ ప్రకటించే నాటికే స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం, వాటికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరవడం మరింత కలవరపాటుకు కారణమవుతోంది. వారిలో ఎంతమందికి కరోనా వైరస్ సోకిందో... వైరస్ సోకిన వాళ్లలో పక్కింటి వాళ్లు, పొరుగింటి వాళ్లు ఎవరున్నారో ...రోజూ నిత్యవసరాలు కొనుగోలుకు వెళ్లినప్పుడు వారిలో ఎవరెవరితో కలిసి తిరిగామో అన్న భయం ప్రస్తుతం పలువురిని వెంటాడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న జిల్లాలు, పట్టణాల్లోని ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ పరిమాణాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
జిల్లా | దిల్లీ వెళ్లొచ్చిన వారి సంఖ్య |
కర్నూలు | 295 |
ప్రకాశం | 130 |
గుంటూరు | 118 |
అనంతపురం | 90 |
కృష్ణా | 89 |
నెల్లూరు | 71 |
కడప | 57 |
తూర్పుగోదావరి | 55 |
విశాఖపట్నం | 49 |
చిత్తూరు | 36 |
పశ్చిమగోదావరి | 35 |
శ్రీకాకుళం | 13 |
విజయనగరం | 4 |
మొత్తం | 1042 |
ప్రభుత్వం దిల్లీ నుంచి వచ్చిన వారిని, వారితో ప్రయాణించిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపడం, కరోనా పరీక్షలు నిర్వహించడాన్ని ముమ్మరం చేసింది. చాలా మందిని ఇప్పటికే క్వారంటైన్ ఆసుపత్రుల్లోనూ, క్వారంటైన్ కేంద్రాల్లోనూ చేర్చారు. మరికొందరిని ఇళ్లలోనే క్వారంటైన్ చేశారు. ఇంకా కొందరిని క్వారంటైన్‌కు పంపించాల్సి ఉంది. దిల్లీకి వెళ్లొచ్చిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఎక్కడైనా రాకపోతే గుర్తించి తరలించాలని అధికారులను ఆదేశించారు.
దిల్లీ నుంచి వచ్చిన వారే అధికం
రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన 44 కరోనా పాజిటివ్ కేసుల్లో దిల్లీలో మత సమ్మేళనంలో పాల్గొని వచ్చినవారు 17 మంది ఉన్నారు. వారితో సన్నిహితంగా మెలగడం వల్ల కరోనా వైరస్ సోకినవారు మరో 8 మంది వరకు ఉన్నట్లు తేలింది. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన 9 కేసులకూ మూలాలు దిల్లీ నుంచేనని అధికారులు గుర్తించారు. ప్రకాశం జిల్లాలో కరోనా సోకిన 11 మంది బాధితుల్లో దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబసభ్యులే అధికంగా ఉన్నారు.
హస్తినకు వెళ్లొచ్చిన ఏపీ పోలీసులు
రాష్ట్రంలోని కరోనా బాధితుల్లో ఎక్కువమంది దిల్లీ లింకు ఉన్నవారే కావటంతో రాష్ట్ర పోలీసు బృందం హస్తినకు వెళ్లి వివరాలు సేకరించింది. ఎక్కడెక్కడ బస చేశారో తెలుసుకుంది. ప్రస్తుతం జాబితాను వడపోసి అనుమానితులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ప్రార్థన జరిగిన సమయంలో ఏపీ నుంచి వచ్చిన ఫోన్‌కాల్ డేటాను విశ్లేషించి ఎవరెవరు వెళ్లారో గుర్తిస్తున్నారు. ప్రతి జిల్లాలోని మసీదు పెద్దల నుంచి, రైల్వే అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఏపీలో ఒక్కరోజే 21 కరోనా కేసులు నమోదు