రెండేళ్లపాటు రెండు విద్యా సంవత్సరాలను కరోనా మింగేసింది.. మరో ఏడాదిని సర్కారు చిదిమేసింది.. అసలే కరోనాతో రెండేళ్లు అభ్యసనం కోల్పోగా పదో తరగతి పరీక్షల్లో సర్కారు తీసుకువచ్చిన భారీ సంస్కరణలు దాదాపు రెండు లక్షలమంది విద్యార్థులను దారుణంగా దెబ్బతీశాయి. ఏడో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు కరోనా కారణంగా 8, 9 తరగతులు చదవకుండానే.. బడికి వెళ్లకుండానే పాస్ అయ్యారు. అంటే ఏడు తర్వాత నేరుగా పదో తరగతి గదిలో కూర్చున్న పిల్లలను అధికారుల అతి తెలివి, ఉపాధ్యాయుల ఉదాసీనత ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఒకవేళ ముందుగా అనుకున్న ప్రకారం సంస్కరణలను ప్రవేశపెట్టాలనే అనుకున్నా పిల్లల్ని సన్నద్ధం చేసేందుకు ఎంత శ్రద్ధ చూపాలి? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? పరీక్షల్లో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా సిద్ధం చేసేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాలి కదా? కానీ, అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోనేలేదు. పిల్లల భవిష్యత్తును గాలికి వదిలి.. ‘నాడు-నేడు, 3, 4, 5 తరగతుల విలీనమంటూ ఏడాది మొత్తం వీటిపైనే దృష్టిపెట్టింది. ఇది లక్షలమంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి దారితీసింది. చాలా బడుల్లో పరీక్షల్లో వచ్చిన మార్పులపై విద్యార్థులకు కనీస అవగాహన కల్పించలేదు. ఒత్తిడికి గురైన సాధారణ విద్యార్థులు పరీక్షల్లో తప్పారు. వీరిలో ఎక్కువమంది ప్రభుత్వ పాఠశాలలవారే ఉన్నారు. చాలా బడుల్లో 50 శాతంలోపే ఫలితాలు వచ్చాయి. 20 ఏళ్ల తర్వాత అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2,01,627 మంది ఫెయిల్ అయ్యారు. తాము చేయని తప్పునకు ఫెయిల్ కావడంతో అవమానం భరించలేక ఇప్పటికే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరం.
కింది తరగతుల్లోనూ ఇబ్బందే.. నిజానికి తొమ్మిదో తరగతిలోనే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి.. పదికి సన్నద్ధం చేస్తుంటారు. కానీ, గతేడాది ఈ పరిస్థితి లేకుండాపోయింది. 8, 9 తరగతుల్లో పాఠాలు సరిగా జరగక చాలామంది పాఠాలు చదవలేకపోతున్నారని, లెక్కలు చేయలేకపోతున్నారని గుర్తించినా దీన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోలేదు.
* విద్యార్థులు రెండేళ్లపాటు నోటు పుస్తకాలు రాయక చేతిరాతలో వేగం తగ్గింది. ఇలాంటి సమయంలో బిట్‌పేపర్ లేకుండా పూర్తిగా ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వచ్చింది. ఎంసెట్, జేఈఈ లాంటి వాటిలో కూడా బిట్‌పేపర్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తున్నారు. ఏ పోటీ పరీక్షలోనైనా ఇదే విధానం ఉంది. అలాంటప్పుడు బిట్‌పేపర్‌ను పూర్తిగా తొలగించడం ఏమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
కౌన్సెలింగ్ ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం: పరీక్ష తప్పామన్న బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అధికార యంత్రాంగంలో మాత్రం చలనం లేదు. టెన్త్‌లో ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. ఇలాంటి సమయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, వారికి స్ఫూర్తిదాయక మాటలు చెప్పేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. దాన్ని పట్టించుకోవడం లేదు. కనీసం హెల్ప్‌లైన్ కేంద్రాల ఏర్పాటు ఊసెత్తడం లేదు. ఫలితాలు విడుదలైన ఆరో తేదీ నుంచి రాష్ట్రంలో రోజుకు ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
ఒకేసారి ఇన్ని మార్పులా?
పదో తరగతిలో సంస్కరణలను తీసుకొస్తున్నట్లు 2019 సెప్టెంబరు 26న ప్రభుత్వం ప్రకటించింది. 2020 మార్చిలో జరిగే పరీక్షల్లో ఈ మార్పులతో పరీక్షలు నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించింది. అయితే కరోనా కారణంగా 2020, 2021ల్లో పరీక్షలు జరగలేదు. కరోనా తగ్గగానే అధికారులు సంస్కరణల కత్తి బయటకు తీశారు. రెండేళ్లపాటు బడికిరాని విద్యార్థుల నెత్తిపై పెట్టారు. 2019లో తీసుకొచ్చిన మార్పులకు అదనంగా 2020లో మరికొన్ని తెచ్చి ఈ ఏడాది పరీక్షలు నిర్వహించారు.
సంస్కరణ-1
అంతర్గత మార్కులు 20 శాతం తొలగింపు. గతంలో పబ్లిక్ పరీక్షలు 80 శాతానికే నిర్వహించేవారు. తరగతిలో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఈ 20 శాతం మార్కులు ఇచ్చేవారు. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా అంతర్గత మార్కులు వేసుకుంటున్నాయని వీటిని తీసేశారు.
ప్రభావం
తరగతిలో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా ఈ మార్కులు వేసేవారు. నోట్‌బుక్స్ రాయడం, తరగతిలో చురుకుగా ఉండడం, అంతర్గత పరీక్షల్లో మార్కులు తదితరాల ఆధారంగా వీటిని నిర్ణయించేవారు. ఎక్కువమంది పిల్లలకు 15-20 వరకు మార్కులు వచ్చేవి. దీంతో రాత పరీక్షలో తక్కువ వచ్చినా అంతర్గత మార్కులతో ఉత్తీర్ణులయ్యేవారు. ఇవి లేకుండా పోవడంతో ఫెయిలైనవారి సంఖ్య పెరిగింది.
సంస్కరణ-2
ప్రశ్నపత్రంలో బిట్‌పేపర్‌కు 25 శాతం వెయిటేజీ తొలగించి, దీన్ని 12 శాతానికి తగ్గించారు. రెండు పేపర్లలో కలిపి గతంలో 40 బిట్లకు 20 మార్కులు ఉండేవి. కొత్తవిధానంలో 24 సూక్ష్మ లఘు ప్రశ్నలు తీసుకొచ్చారు. వీటికి నేరుగా సమాధానాలు రాయాలి. తొలగించిన 20 అంతర్గత మార్కులు తీసేసినందున వాటికీ ప్రశ్నలు పెట్టారు. దీంతో రాత ప్రశ్నల సంఖ్య పెరిగింది.
ప్రభావం
విద్యార్థులపై ఒత్తిడి ఎక్కువైంది. గతంలో చివరి అరగంటలో బిట్‌పేపర్ ఇచ్చేవారు. అవి బహుళైచ్ఛిక ప్రశ్నలు కావడంతో విద్యార్థులు వేగంగా సమాధానాలను గుర్తించేవారు. పుస్తకం చదివితే బిట్ పేపర్ రాయడం తేలికగా ఉండేది. ఇప్పుడు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాల్సి వచ్చింది. ఇది సాధారణ విద్యార్థులకు కష్టంగా మారింది.
సంస్కరణ-3
పదకొండు పేపర్లను ఏడుకు కుదించారు. గతంలో హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉండేవి. కరోనా సమయంలో ఎక్కువ రోజులు పరీక్షలు నిర్వహించడం కష్టమని మొదట ఆరు పేపర్లు చేశారు. ఆ తర్వాత సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన, జీవశాస్త్రాలను కలిపి పరీక్ష నిర్వహిస్తే మూల్యాంకనం చేయడం కష్టమనే ఉద్దేశంతో వీటిని రెండుగా చేసి, ఏడు పేపర్లకు పరీక్షలు పెట్టారు. ప్రశ్నల సంఖ్యను పెంచకుండా మార్కులను రెట్టింపు చేశారు.
ప్రభావం
రెండు పేపర్ల విధానం ఉంటే ఒకదాంట్లో సరిగా రాకపోయినా మరో దాంట్లో మార్కులు పెంచుకునేందుకు విద్యార్థులకు అవకాశం ఉండేది. పాఠ్యప్రణాళిక మొత్తం ఒకేసారి చదవాల్సిన పని ఉండేది కాదు. మరుసటిరోజు జరిగే పరీక్షకు చదువుకునేందుకు కొంత సమయం లభించేది. ఏడు పేపర్ల విధానంతో విద్యార్థులు ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఒకేసారి మొత్తం చదవాల్సి రావడంతోపాటు ప్రశ్నల ఛాయిస్ తగ్గిపోయింది. ఇది వారిపై ఒత్తిడి పెంచింది. తరగతిలో వెనుకబడిన విద్యార్థులు ఫెయిల్ అయ్యేందుకు దారి తీసింది.
సంస్కరణలు వికటించే ఈ ఫలితాలు: ఎస్టీయూ
‘పరీక్షల సంస్కరణల పేరుతో బిట్‌పేపర్ తొలగించడం, ఒక మార్కు ప్రశ్నలు స్థాయికి మించి పెద్దవి ఇవ్వడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీనికితోడు అంతర్గత మార్కులు లేకపోవడం, విద్యార్థులు కరోనాతో చదువుకు దూరమవడం ఫలితాలపై ప్రభావం చూపాయి. ఒక్కో సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటే ఒకటి సరిగా రాయకపోయినా మరొక దాంట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించేవారు. వంద మార్కులకు ఒకే పేపర్ కావడంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది’
- లంకలపల్లి సాయిశ్రీనివాస్, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం
ప్రభుత్వం, విద్యాశాఖ విధానాలే కారణం
‘ప్రభుత్వం, విద్యాశాఖ అనుసరించిన విధానాలే పరీక్షల ఫలితాలకు మూల కారణం. పరీక్ష పేపర్ల విధానంలో మార్పులు తెచ్చారు. వంద మార్కులకు పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులకు ప్రశ్నల్లో ఛాయిస్ తగ్గిపోయింది. పరీక్షల్లో వచ్చిన మార్పులు అనుత్తీర్ణతకు దారితీశాయి’
- హృదయరాజు, అధ్యక్షుడు, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య
ఇదీ చదవండి: విద్యాశాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర: చంద్రబాబు