రాష్ట్రంలో ఈ ఏడాది లక్షన్నర హెక్టార్లలో రూ.1,190.11 కోట్లతో సూక్ష్మసేద్యం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాలులో పంటల కొనుగోలుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయనతోపాటు మంత్రులు కొడాలి నాని, ఎం.శంకరనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ‘రెండు హెక్టార్లలో సూక్ష్మసేద్యం చేసే రైతులకు 90% రాయితీనిస్తాం. రాయలసీమతోపాటు ప్రకాశం జిల్లాలో నాలుగు హెక్టార్ల వరకు 70% రాయితీ, కోస్తాలోని మిగిలిన జిల్లాల (ప్రకాశం మినహా) రైతులకు 5హెక్టార్ల వరకు 50% రాయితీ అమలుచేస్తాం’ అని మంత్రి కన్నబాబు వివరించారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లో నగదు జమ చేస్తున్నామని, ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కన్నబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. రైతులు తప్పనిసరిగా ఈ-పంటలో పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా పొలాల వద్దకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.
ధాన్యం బకాయిలు త్వరలో చెల్లిస్తాం
ధాన్యం కొనుగోలుకు సంబంధించి 21 రోజుల గడువు దాటిన బకాయిలు రూ.360 కోట్లు ఉన్నాయని, త్వరలోనే వాటిని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు.ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం నుంచి రూ.3,299 కోట్లు రావాల్సి ఉందని, దీనిపై ప్రధాని మోదీతోపాటు కేంద్ర పౌరసరఫరాల మంత్రికి సీఎం లేఖలు రాశారని తెలిపారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘2021 రబీలో 45 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంకాగా, ఇప్పటికే రూ.4,729 కోట్లతో 25.26 లక్షల టన్నులు కొన్నాం.జులై నెలాఖరు వరకు ప్రక్రియ కొనసాగుతుంది. రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఈ-పంటలో సమాచారం ఆధారంగా ధాన్యం సేకరణ జరుగుతోంది. ఇప్పటివరకు 3.78 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. 2.84 లక్షల మందికి కూపన్లు ఇచ్చాం. శశిధర్, పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి.
ఖరీఫ్‌లో ఈ రకాల సాగు వద్దు
స్థానికంగా ఆహారానికి వినియోగించని 1010, ఎంటీయూ 1001, ఎన్‌ఎల్‌ఆర్ 145 వరి రకాలను సాగు చేయొద్దని కోన శశిధర్ రైతులను కోరారు. వీటిని ప్రజలు వినియోగించకపోవడంతోపాటు ఎఫ్‌సీఐ తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...