అప్పు తీసుకురాకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పని చేయదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున అభిప్రాయపడ్డారు. తామూ తెస్తున్నామని, వాటిని రాష్ట్రాన్ని బాగు చేయడానికే వినియోగిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎంత తెచ్చారు? ఎంత తీర్చారో? చెప్పడానికి ఇవేమీ చిట్టాపద్దులు కాదని వివరించారు. ప్రతి దాంట్లోనూ జవాబుదారీతనంగా ఉంటామని స్పష్టం చేశారు. తాము ఎంత అప్పు చేశామో.. ప్రధాని ఎంత అప్పు చేశారో? ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత చేస్తున్నారో? ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
ఎస్సీ గురుకులాల్లో ‘సీబీఎస్‌ఈ’: రాష్ట్రంలోని 179 ఎస్సీ గురుకులాల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. పెద్దగా డిమాండు లేని కోర్సుల స్థానంలో ప్రాధాన్యమున్న కోర్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తాడేపల్లిలో ఎస్సీ గురుకులాలకు సంబంధించి బోర్డు ఆఫ్ గవర్నెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎస్సీ విద్యార్థులకు శ్రీకాకుళం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎమ్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏలూరు జిల్లా పోలసానిపల్లి, పెదవేగిల్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న 3 ఐఐటీ, నీట్ శిక్షణ కేంద్రాలతోపాటు అదనంగా ఉమ్మడి జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని తెలిపారు.
ఇవీ చదవండి: