వైఎస్ షర్మిల.. భాజపా సంధించిన బాణంగా భావిస్తున్నామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెరాసను ఒంటరిగా ఎదుర్కొలేక కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్లో పలువురు యువకులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు.
హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వేర్వేరు పండుగలు జరుపుకున్నా.. కేసీఆర్ పుట్టినరోజు మాత్రం అన్ని మతాల వారికి పండగేనని మంత్రి పేర్కొన్నారు. అందుకే తాను ఇవాళ కొత్త బట్టలు ధరించినట్లు వివరించారు. షర్మిల అనే ఒక బాణాన్ని వదిలితే తెలంగాణాలో ఆ బాణాన్ని ఎదుర్కోవడానికి కోటి బాణాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. షర్మిల తెలంగాణ వచ్చే కంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం నడుస్తున్న దృష్ట్యా అక్కడికి వెళితే అక్కడి ప్రజలు సంతోషపడతారని మంత్రి గంగుల కమలాకర్ సలహా ఇచ్చారు.