రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కొత్త సాఫ్ట్ వేర్ సహాయంతోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం రెవెన్యూ ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. నకిలీ చలానాల వ్యవహారంపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజి శేషగిరి బాబుతో క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి రెండు దశలలో ఈ అవకతవకలపై మరిన్ని ఆధారాలు సేకరించామన్నారు.
రాష్ట్రం మొత్తం మీద 11 జిల్లాలో 36 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సొమ్ము పక్కదారి పట్టినట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం 7 కోట్ల13 లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగినట్టుగా తేలిందన్నారు. ఇప్పటివరకు 3 కోట్ల 38 లక్షల రూపాయలు వసూలు చేశామని వెల్లడించారు. సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని, ప్రమేయం ఉన్న ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. బోగస్ చలాన్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం చేయాలనే దానిపై న్యాయ సలహా కూడా తీసుకొంటున్నామని, అధికారులు దర్యాప్తును వేగంగా పూర్తి చేశారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయని, రిజిస్ట్రేషన్ల సేవలు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నామని కృష్ణదాస్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: JAGANA TOUR: కుటుంబ సమేతంగా సీఎం షిమ్లా పర్యటన