వేసవిలో పట్టణ ప్రాంతాల్లో మంచినీటి కొరత లేకుండా ముందస్తు చర్యలను తీసుకోవాలని, వచ్చే మూడు నెలల కాలానికి అవసరమైన నీటి నిల్వలను ట్యాపింగ్ చేసుకుని ఉంచుకోవాలని కమిషనర్లను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఏ ఒక్క ప్రాంతంలోనూ తాగునీటి ఇబ్బంది ఎదురవ్వకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని వివరించారు. అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన కార్యాచరణను రూపొందించుకుని చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా టిడ్కో ఆధ్వర్యంలోని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలన్న ముఖ్యమంత్రి లక్ష్యాన్ని సాధించడానికి చర్యలు తీసుకోవాలని... మున్సిపల్ కమిషనర్లను మంత్రి బొత్స ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను సత్వరం చేపట్టాలని నిర్దేశించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణ, బయోమైనింగ్ తదితర అంశాలపైనా సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకమండళ్ల తొలి సమావేశాలను ఈ నెల 29 లోగా నిర్వహించాలని మంత్రి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్ పర్సన్లకు వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు త్వరలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధంవంతంగా నిర్వహించినందుకు పురపాలక శాఖ సిబ్బందిని అభినందించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సీడీఎంఎ ఎం.ఎం. నాయక్, టిడ్కో ఎండి శ్రీధర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్, ఇంజినీర్ ఇన్ ఛీప్ చంద్రయ్య, మెప్మా ఎండి విజయలక్ష్మి తదితర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్నారు.