'నాకు తెలిసి.. వాలంటీర్లపై పని ఒత్తిడేం లేదని' పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు . ఆ వీధిలో ఉన్న 50 కుటుంబాల్లో సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం, ఫలాలు అందేలా చూడటం, రేషన్ అందిందో లేదో కనుక్కోవడమే. మొత్తంగా రోజులో అరగంట పని.. అని ఆయన వ్యాఖ్యానించారు. పని ఒత్తిడిలాంటిది ఏమైనా ఉంటే తగ్గిస్తామన్నారు. తాను ఎక్కడ పర్యటనకు వెళ్లినా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను పిలిచి మాట్లాడతానని.. తన దృష్టికి ఎప్పుడూ ఈ విషయం రాలేదని చెప్పారు. జీతాలు పెంచాలని కొందరు వాలంటీర్లు ఆందోళన చేయడంపై సీఎం జగన్ ఎంతో బాధపడ్డారని చెప్పారు.
‘వారంలో మూడు రోజులు.. ఖాళీగా ఉన్న సమయంలో తమ వీధిలో, చుట్టుపక్కల వారికి సేవలందించడానికి వాలంటీర్లను నియమించారు. వారంలో ఏడు రోజులు అంకితం కావాల్సిన పనిలేదు. ఊరంతటికీ జవాబుదారీ కాదు. వారికి ఇచ్చేది గౌరవ వేతనమే. జీతం కాదు. జీతం తీసుకుంటే ఈ గౌరవం దక్కదు. మంచి ఉద్యోగం వస్తే వెళ్లిపోవచ్చు. వాలంటీర్లకు సమాజంలో గౌరవం ఉంది. దాన్ని పాడు చేసుకోవద్దు. వ్యవస్థకు తూట్లు పొడవాలనే దుష్టశక్తుల ఆలోచనల్లోకి వెళ్లవద్దని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనల్లో ఉన్నారని బొత్స విమర్శించారు.
ఇదీ చూడండి. పంచాయతీ ఎన్నికలు: ఫిర్యాదులకు ఈ నెంబర్కు ఫోన్ చేయండి!