అమరావతిపై హైకోర్టు తీర్పును ముందే ఉహించామని.., అందులో కొత్తగా ఏమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా ? లేదా ? అనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించి చెబుతామని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందో తెలియదని.., తీర్పు కాపీని పూర్తిగా చదివాక అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. రాజ్యాంగ పరంగా చట్టపరిధిలో చట్టాలు చేసేందుకే శాసన సభ, పార్లమెంట్ ఉన్నాయని..,శాసన సభలో చట్టాలు చేయకూడదంటే ఎలా అని హైకోర్టును మంత్రి బొత్స ప్రశ్నించారు. తీర్పులో ఇలా ఉండదనే తాను అనుకుంటున్నట్లు తెలిపారు.
మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే ఎలా ఇస్తారని.., ఏదైనా ప్రాక్టికల్‌గా ఆలోచించాలన్నారు. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతామన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఈ క్షణం వరకూ కట్టుబడి ఉన్నట్లు బొత్స స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పులో ఏముందంటే..
అమరావతిపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని.. అలాంటప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు చేయడం కుదరదన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సూచించిందని న్యాయవాదులు తెలిపారు. అమరావతి కోసం సేకరించిన భూములను రాజధాని అవసరాలకే వినియోగించాలని ఆదేశించింది. పూలింగ్ భూములను ఇతర అవసరాలకు తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
రిట్ ఆఫ్ మాండమస్ నిరంతరం కొనసాగుతుందని.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిట్ ఆఫ్ మాండమస్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లందరికీ ఖర్చుల కింద 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కార్యాలయాల తరలింపుపైనా మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లకుండా ప్రజల ఆకాంక్షను గౌరవించాలని న్యాయవాదులు సూచించారు.
ఇదీ చదవండి
High Court Verdict on Amaravati: సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి: హైకోర్టు