agricultural power consumption : వ్యవసాయ విద్యుత్ వినియోగం 2022-23లో 19,819 మిలియన్ యూనిట్ల(ఎంయూ)కు చేరే అవకాశం ఉందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా పగటి పూట 9 గంటలు విద్యుత్ అందించాలని డిస్కంలను ఆదేశించారు. వేసవి కాలం దృష్ట్యా విద్యుత్‌కు డిమాండ్ ఎంత పెరిగినా అందుకు తగ్గట్లు ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరాపై ఆయన ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 2021-22లో 19,096 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. 2022-23లో డిమాండ్ 19,819 ఎంయూలకు చేరవచ్చని అంచనా. గత ఏడాది కంటే 3.7 శాతం వినియోగం ఎక్కువ. రాష్ట్రంలోని అన్ని రంగాలు కలిపి రోజువారీ సగటు విద్యుత్తు వినియోగం 2022 జనవరిలో 178.90 ఎంయూలు కాగా 2021 జనవరిలో 171.92 ఎంయూలుగా ఉంది. 2022 జనవరిలో గరిష్ఠ డిమాండ్ 10,122 మెగావాట్లు ఉంటే.. నిరుడు అదే సమయానికి 9,977 మెగావాట్లు. రాష్ట్రంలో 2022 మార్చి నుంచి మే నెల వరకు మొత్తంగా 20,143 ఎంయూల డిమాండ్ ఉంటుందని అంచనా వేశాం. సాంకేతిక సమస్యలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి. జెన్‌కో ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయి విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను సమకూర్చుకునేలా జెన్‌కో ఎండీ శ్రీధర్ పర్యవేక్షిస్తారు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చౌకగా విద్యుత్తు వాహనాలు.. 'బ్యాటరీ మార్పిడి సేవ' విస్తరణతో