కొవిడ్ పరిస్థితులపై భేటీ అయిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. రాష్ట్రంలోని కొవిడ్ పరీక్షలు, పడకలు, ఆక్సిజన్ కొరత, రెమ్‌డెసివిర్, హెల్ప్ డెస్క్‌పై చర్చించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 60 కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న మంత్రి.. మరో 30 వేల కొవిడ్ పడకలు అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఆక్సిజన్ కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు ఆళ్ల నాని తెలిపారు. కేంద్రం కేటాయించిన 482 టన్నుల ఆక్సిజన్ వాడుకునేందుకు ఏర్పాటు చేశామన్న ఆళ్ల నాని.. ప్రభుత్వ, ప్రైవేటు అస్పత్రుల్లో రెమ్‌డెసివిర్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
'అక్రమాలు జరగకుండా కమిటీ వేశాం'...
33 వేల కొవిడ్ కేంద్రాల్లో పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఆస్పత్రుల్లో పడకలపై రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నందున.. కరోనా రోగులకు 37 వేల వరకు పడకలు పెంచినట్లు వివరించారు. ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నామని మంత్రి అన్నారు. కేంద్రం కేటాయించిన ఆక్సిజన్ తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేశామన్న మంత్రి.. రెమ్‌డెసివిర్ విక్రయం, వినియోగంలో అక్రమాలు జరగకుండా కమిటీ వేసినట్లు వెల్లడించారు.
'నివేదిక రాగానే చర్యలు'...
రాష్ట్రంలోని పలుచోట్ల పడకలు, ఆక్సిజన్ లభించక మృతిచెందిన వారిని ఉద్దేశించి మంత్రి ఆళ్ల నాని విచారం వ్యక్తం చేశారు. ఒకరిద్దరి నిర్లక్ష్యం వల్ల ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని, ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విశాఖ కేజీహెచ్ ఘటనపై విచారణ కోరామన్న మంత్రి.. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 62 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని వెల్లడించారు.
'విమర్శలు అనాలోచితంగా ఉన్నాయి'...
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు, వ్యాఖ్యలు అనాలోచితంగా ఉన్నాయని ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితిపై సీఎం జగన్ నిత్యం సమీక్ష చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనలను కిందిస్థాయికి తీసుకెళ్లాలని అధికారులను కోరారు.
ఇవీచదవండి.