ఈ ఏడాది చివరికల్లా లక్ష ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక విధానం, ఉపాధి కల్పన, పాలసీలో దృష్టి పెట్టవలసిన కీలక రంగాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇప్పటివరకూ సంక్షేమం దిశగా ప్రభుత్వ పాలన సాగిందని, ఇకపై పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సీఎం వెల్లడించినట్లు మంత్రి తెలిపారు. అందుకు తగ్గట్లుగా ఈడీబీని మరింత పటిష్టం చేయాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్‌కు సూచించారు. రాష్ట్రం తరఫున దిల్లీ కేంద్రంగా ప్రత్యేక ఈడీబీ బృందాన్ని నియమించాలని ఆదేశించారు.
పారిశ్రామిక విధానం 2020-2025 పెట్టుబడులు తీసుకువచ్చేలా ఉండాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలకు అందించే పవర్ సబ్సిడీ వివరాలు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందన్న విషయంపైనా మంత్రి ఆరా తీశారు. పారిశ్రామిక విధానంలో ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్, డిఫెన్స్, ఆటోమోటివ్, ఆహారశుద్ధి, వస్త్ర, ఫార్మా, వ్యవసాయ, విద్య, నైపుణ్య రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు.
రంగాలవారీగా పరిశ్రమల స్థాపనకు జిల్లాలలో అందుబాటులో ఉన్న ఏపీఐఐసీ భూముల వివరాల లెక్క తేల్చాలన్నారు. రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమలను చక్కదిద్దే చర్యలపై ఆ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేతో మంత్రి చర్చించారు. చక్కెర పరిశ్రమను గాడిన పెట్టడానికి ఉన్న మార్గాలను, వివరాలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సాయం తదితర వివరాలపై మంత్రి సమీక్షించారు.
ఇదీ చదవండి : జగన్.. బెయిల్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు : సీబీఐ