ఓట్లతో పని లేకుండా ప్రజలకు మేలు కలుగుతుందా లేదా అనే యోచనతోనే రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు, అనుచరులకు పిలుపునిచ్చారు. అవకాశవాద రాజకీయాలకు జనసేన పార్టీ దూరంగా ఉంటుందని, పార్టీ భావజాలానికి అనుగుణంగా పని చేయడమే మన లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ పాల్గొన్నారు.
ఆంగ్లానికి జనసేన వ్యతిరేకం కాదు...
ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కొత్త తరం, పాత తరం మధ్య అంతరాలు ఉన్నాయని.. భావితరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకపోతే అన్యాయం చేసినవాళ్ళం అవుతామనీ అన్నారు. మనం ఏం మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడుదామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్ధి పార్టీల వారు ప్రలోభపెట్టో, భయపెట్టో ప్రజలపై పట్టు సాధించుకోవాలని చూస్తున్నారని.... అయితే జనసేన పార్టీ ప్రజల అభిమానంతో క్రమంగా, స్థిరంగా ఎదుగుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం సమంజసమేనా?
భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగును ప్రాథమిక స్థాయిలోనే బోధన భాషగా లేకుండా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. భాషను వదిలేస్తే సంస్కృతి నశించి, సంస్కృతి మూలాలు అంతరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆంగ్ల మధ్యమానికి వ్యతిరేకం కాదని, తెలుగు మాధ్యమం కూడా ఉండాలని కోరుతోందని చెప్పారు. నాయకులు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తానని పవన్ తెలిపారు.
ఇదీ చదవండి: