Love Medicine : తొలి చూపులోనే ప్రేమలో పడిపోయేవారు కొందరు. నెలలు, ఏళ్ల కొద్దీ ప్రయత్నించినా విఫల ప్రేమతో ముగించేవారు మరికొందరు. అవును మరి. ప్రేమ ఎలా పుడుతుందో, ఎవరు ఎవర్ని ఇష్టపడతారో, ఎందుకు ఇష్టపడతారో, ఆకర్షణ ఎలా మొదలవుతుందో ఎవరికి తెలుసు ? ఇదో సంక్లిష్ట వ్యవహారం. మన శరీరంలోని ప్రతి వ్యవస్థతో ప్రేమ ఎలా ముడిపడి ఉంటుంది, ఇది జీవితంలోని వివిధ పార్శ్వాలను ఎలా స్పృశిస్తుందనేది ఇప్పటికీ ఆశ్చర్యమే. దీని గుట్టు మట్లను గుర్తించటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా కృషి చేస్తూనే ఉన్నారు. వీటి ఆధారంగా ప్రేమను పుట్టించే మందుల రూపకల్పన మీదా దృష్టి సారించారు. ‘ప్రేమ ఔషధం’ మాట ఈనాటిది కాదు. నాలుగు వేల ఏళ్ల కిందటే వీటిని వాడినట్టు రుజువులు దొరికాయి. ఇతరత్రా మందుల మాదిరిగానే ప్రేమ ఔషధాలను మరో పదేళ్లలో దుకాణాల్లో కొనుక్కున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. నిజానికి వీటిని ఇప్పటికే దంపతుల మధ్య అన్యోన్యత కలిగించటానికి కొన్నిదేశాల్లో వాడుతున్నారు కూడా.
నాలుగు రసాయనాలు
Medicine for Love : ప్రేమ భావన కలగటంలో మన శరీరంలో ఉత్పత్తయ్యే నాలుగు రసాయనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒకటి- ఆక్సిటోసిన్. ప్రేమ, అన్యోన్యత, అనుబంధాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆత్మ విశ్వాసం, నమ్మకం పెంపొందటానికీ తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంటే కొత్త సంబంధాలు ఏర్పరచుకోవటానికీ దోహదం చేస్తుందన్నమాట. రెండోది- డోపమైన్. ఇదేమో మెదడులో రివార్డు కేంద్రాన్ని ప్రేరేపించి ఆత్మీయత, అన్యోన్యతలను కొనసాగించేలా ప్రోత్సహిస్తుంది. మూడోది- సెరటోనిన్. ప్రేమకు సంబంధించిన ఆకర్షణ అంశాలకు దన్నుగా నిలుస్తుంది. నాలుగోది- బీటా-ఎండార్ఫిన్. దీర్ఘకాలంలో ప్రేమకు కట్టుబడి ఉండేలా చూసేది ఇదే.
ఇతర అవసరాల కోసం
Medicine to Cause Love : ప్రేమను అనుకరించే సామర్థ్యం గల కొన్ని మందులను ఇప్పటికే వాడుతున్నాం. కాన్పు నొప్పులను ప్రేరేపించటానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను ఉపయోగించటం కొత్తేమీ కాదు. నమ్మకం, సానుభూతి, కలివిడి వంటి వాటినీ ఇది పెంచుతుంది. డోపమైన్, సెరటోనిన్, ఎండార్ఫిన్లను రకరకాల మానసిక జబ్బుల్లో వాడుకుంటున్నారు. మరి ఇలాంటి మందులను ప్రేమను ప్రేరేపించటానికి, కొనసాగించటానికి వాడుకోవచ్చా? చాలామందికి వచ్చే సందేహం. కుంగుబాటును తగ్గించే యాంటీడిప్రెసెంట్ల మాదిరిగానే వీటిని ఉపయోగించుకోవచ్చన్నది నిపుణుల భావన. ఎందుకంటే ఇవన్నీ కొత్తవేమీ కాదు. ఒంట్లో సహజంగా పుట్టుకొచ్చేవే. పైగా వీటితో అనోన్య సంబంధాలు.. మంచి శారీరక, మానసిక ఆరోగ్యాలు సొంతమవుతాయి. ఇలా జీవితాన్ని హాయిగా గడపటానికీ తోడ్పడతాయి. కాకపోతే ఇవి వ్యసనంగా మారే ప్రమాదం ఉండటమే కాస్త వెనకడుగు వేసేలా చేస్తోంది.
నైతికంగా సబబేనా?
Love Medicine for Couple : ప్రేమ మందుల వాడకం నైతికంగా సమంజసమైనదేనా? వ్యక్తిగతంగా చూస్తే మాత్రం తప్పులేదనే అనిపిస్తుంది. వీటితో ఏవైనా ముప్పులు ఎదురైతే నివారించుకునే అవకాశం ఎలాగూ ఉంటుంది. మందులను ఎప్పుడంటే అప్పుడు ఆపేయొచ్చు మరి. కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చు. ప్రేమలో పడ్డప్పుడు జీవితం హాయిగానే ఉంటుంది. ఆనంద సాగరంలో తేలియాడుతున్నట్టుగానే ఉంటుంది. అదే ప్రేమ విఫలమైతే? జీవితం దుర్భరంగా మారుతుంది. మనసంతా అల్లకల్లోలం అయిపోతుంది. నిరాశా నిస్పృహలతో కొందరు తీవ్ర చర్యలకూ ఒడిగట్టొచ్చు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవటానికీ ప్రేమ మందులు ఉపయోగపడతాయి. ఇవి ప్రతికూల భావోద్వేగాలు తగ్గటానికి, వేదనాభరిత జ్ఞాపకాలు చెదిరిపోవటానికి తోడ్పడతాయి. ఇలా సానుకూల, ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే ప్రేమ ఔషధాలు మేలు చేసే అవకాశమే ఎక్కువ. మన జీవితాలకు కేంద్ర బిందువు ప్రేమే. అలాంటి ప్రేమ భావనను పరిఢవిల్లజేసే మందులు.. అదీ దుష్ప్రభావాలకు తావివ్వనివి అందుబాటులోకి వస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? పరస్పర అన్యోన్యత, ప్రేమ భావనలను అంచనా వేయటంలో ఇటీవల వినూత్న పరిజ్ఞానాలు పుట్టుకొచ్చాయి. జన్యు పొందికల పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కొంగొత్త ప్రేమ ఔషధాల రూపకల్పనకు కొత్త దారులు చూపిస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.
- ఇదీ చదవండి : మానసిక ఒత్తిడి ఉంటే శృంగారంలో పాల్గొనలేరా?