చిన్నప్పటి నుంచి ఆమె చదువులో ముందుండేది. ఈ క్రమంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అంతలోనే ఆమెకు ఇంట్లో వాళ్లు వివాహం చేశారు. అయినా తన కల నిజం చేసుకోవాలనే పట్టుదలతో భర్తకు తోడుగా తాను కూడా వైద్య సేవలు అందించాలని అనుకుంది. ఆ ఆలోచనతోనే పీజీ చేస్తోంది.. ఇంతలోనే ఆమె కన్న కలలు కల్లలయ్యాయి. ఓ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తి చేతిలో మృతి చెందింది.
తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన వైద్య విద్యార్థిని అక్షిత(27)కు నాలుగేళ్ల కిందట రేగొండ మండలం నిజాంపల్లికి చెందిన వైద్యుడితో పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఆయన భూపాలపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నారు. వారికి మూడేళ్ల వయస్సు పాప ఉంది. అక్షిత కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లోని మెడికల్ కళాశాలలో పీజీ చేస్తోంది. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంది. ఐదు నెలల కిందట ప్రయాణంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువుకు చెందిన మహేశ్‌వర్మతో పరిచయం ఏర్పడింది. ఫోన్ నంబర్, సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలు సేకరించుకొని ఆమెతో చాటింగ్ చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తనకు పెళ్లి అయిందని, బిడ్డ ఉందని ఆమె తిరస్కరించింది. సామాజిక మాధ్యమాల ఖాతాల్లోని ఆమె ఫొటోలను దిగుమతి చేసుకొని మార్ఫింగ్ చేసి వేధింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వాలని, తన వద్దకు రావాలని బెదిరించాడు.
వరంగల్ నుంచి చిక్‌బళ్లాపురం వెళ్లడానికి అక్షిత ఈనెల 23వ తేదీ సాయంత్రం జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. చిక్‌బళ్లాపురానికి వెళ్లడానికి 24వ తేదీ ఉదయం హిందూపురంలో దిగింది. అమె వెంట మహేష్ వర్మ సైతం అదే రైలులో వచ్చాడు. మాట్లాడుకొని, సెటిల్ చేసుకొందామని అతను ఆమెను లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో గొంతు పిసికి చంపేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు పట్టుకొన్నారు. మృతురాలి సోదరుడు శశాంక్ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హిందూపురం పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
తల్లిని కోల్పోయిన చిన్నారి.. అక్షిత మృతితో తిమ్మంపేటలో విషాదం నెలకొంది. తండ్రి ఐదేళ్ల కిందటే మృతిచెందగా, గ్రామంలో తల్లితో పాటు తమ్ముడు ఉంటున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కంటతడి పెట్టుకున్నారు. అక్షితకు మూడేళ్ల పాప ఊహ తెలియకముందే తల్లిని కోల్పోయింది. హిందూపురంలో పోస్టుమార్టం నిర్వహించి, భర్త స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి..