మానసి తండ్రి గిరిశ్చంద్రజోషి ‘భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్’లో శాస్త్రవేత్త. స్వరాష్ట్రం రాజస్థాన్. ఉద్యోగరీత్యా ముంబయికి మారారు. గిరిశ్చంద్ర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కూడా. ఆరేళ్ల వయసులో తనంత ఎత్తున్న రాకెట్ పట్టుకుని.. ‘నేనూ ఆడతా నాన్నా’ అన్న కూతురికి అందులో శిక్షణ ఇప్పించాడు. జిల్లాస్థాయి వరకూ వెళ్లి అనేక టోర్నమెంట్లు గెలిచినా.. అదే కెరీర్ అనుకోలేదు మానసి. ఇంజినీరింగ్ పూర్తిచేసి.. అటోస్ ఇండియా సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టింది.
తలకిందులైన జీవితం..
ఒక్క సంఘటన చాలు... సాఫీగా సాగే జీవితాన్ని తలకిందులు చేయడానికి. అలాంటిదే మానసి జీవితంలో జరిగింది. ఎనిమిదేళ్ల క్రితం ఆఫీస్‌కి బయలుదేరిన ఆమె స్కూటర్‌ని.. ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీకొట్టింది. ఎడమకాలు ట్రక్ చక్రాల కిందపడి నలిగిపోయింది. డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. పైగా ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఆ కాలిని మోకాలి పైవరకూ తీసేయక తప్పలేదు. రెండు నెలలు మంచానికే పరిమితమైన మానసి ముందు రెండే రెండు దారులు కనిపించాయి. ఒకటి.. ‘ఇలా కాకుండా ఉండాల్సింది!’ అనుకుంటూ కాలాన్ని నిస్తేజంగా గడిపేయడం. రెండు.. ఉన్న పరిస్థితులని అంగీకరించి భవిష్యత్తు గురించి ఆలోచించడం. ఆ రెండో దారినే ఎంచుకుంది మానసి. ప్రమాదం జరిగిన మూడోనెలకి చేతికర్ర సాయంతో నడక ప్రారంభించింది.
కొత్త లక్ష్యం...
గాయం తాలూకూ బాధని తగ్గించుకోవడానికి బ్యాడ్మింటన్‌కి మించిన మార్గం లేదనుకుంది. ఆటసాయంతో మానసికంగా, శారీకంగా తిరిగి కోలుకోవడం మొదలుపెట్టింది. ఈలోపు తను పనిచేస్తున్న సంస్థ నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆ గెలుపు ఆమెలో చిన్నప్పటి క్రీడాకారిణిని మేల్కొల్పింది. ప్రోస్థటిక్ కాలి సాయంతో మరింత చురుగ్గా ఆడటం మొదలుపెట్టింది. ‘మొదట్లో చాలా కష్టమైంది. కానీ నా దృష్టంతా దానిపైనే పెట్టిన తర్వాత ఆట తేలికైంది’ అనే మానసి.. గాయం నుంచి కోలుకున్న రెండేళ్లకి మహారాష్ట్ర తరఫున జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఆ పోటీల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత పరుల్ పర్మార్‌పై గెలిచిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఆ సమయంలో అంతర్జాతీయ క్రీడాకారుడు నీరజ్‌జార్జ్ ఇచ్చిన స్ఫూర్తి.. తనలో తపనని రగిల్చిందని చెబుతుంది మానసి. ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయి క్రీడాకారిణిగా మారిపోయింది.
ప్రపంచ ఛాంపియన్..
గెలవాలన్న బలమైన కోరికతోపాటు... గెలిచే టెక్నిక్ కూడా తెలియాలిగా! నైపుణ్యాలకు పదును పెట్టుకోవడానికి... హైదరాబాద్‌లోని గోపిచంద్ అకాడమీలో చేరింది మానసి. ఆ శిక్షణ ఆమెను గతేడాది స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలుచుకునేలా చేసింది. ఆ విజయంతో వచ్చే ఏడాది జపాన్‌లో జరిగే పారా ఒలింపిక్స్‌లో ఆడేందుకు అర్హత సాధించింది. ఆమె సాధించిన విజయాలు వైకల్యంలో బాధపడుతూ ‘ఇక ఏం సాధించలేమా’ అని నిరాశనిస్పృహలో ఉన్న ఎంతోమందిలో స్ఫూర్తిని రగిలించాయి.
టైమ్ ముఖచిత్రమై..
మానసిని నవతరం నాయకత్వ లక్షణాలున్న మేటి మహిళగా, ఆసియాలోని ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించిన టైమ్ మ్యాగజైన్.. అక్టోబరులో ఆసియా ఎడిషన్‌ని ఆమె ముఖచిత్రంతో ముద్రించింది. ‘ప్రమాదం తర్వాత జీవితమే లేదనుకున్నా. క్రీడాకారిణిగా మారాక కాళ్లు లేని ఓ పాప ‘నువ్వే నా రోల్ మోడల్ అక్కా..’ అని అనడం నా బాధ్యతని మరింత పెంచింది’ అని చెప్పే మానసి... దివ్యాంగుల హక్కుల కోసం తాను చేస్తున్న పోరాటాన్ని మరింత విస్తృతం చేసింది. ప్రోస్థటిక్ లెగ్ సాయంతో ఆడే మానసి... వాటిపై పెద్దఎత్తున పన్నులు వేయడాన్ని నిరసిస్తోంది. ‘నడవడానికి కూడా పన్ను కట్టాలా?’ అని ప్రశ్నిస్తోంది. దివ్యాంగులకు అనుకూలంగా చట్టాలు తేవడం, వారికోసం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడంపైన ప్రభుత్వాలు దృష్టిపెట్టాలంటోంది.
బార్బీ బొమ్మగా మారి..
తాజాగా.. ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ రోజున బార్బీ బొమ్మల తయారీ సంస్థ ‘వన్ ఆఫ్ ఏ కైండ్’ విభాగంలో మానసి రూపంలోని బార్బీబొమ్మని విడుదల చేయడం విశేషం. గతంలో క్రీడాకారిణి నవోమీ ఒసాకా, పర్యావరణవేత్త బిండీ ఇర్విన్ వంటివారిపైన ఇలాంటి బొమ్మలు వచ్చాయి. మనదేశం నుంచి పారాస్పోర్ట్స్ విభాగంలో ఆ గౌరవాన్ని దక్కించుకున్న తొలిమహిళ మానసి. ‘చిన్నపిల్లలకు బొమ్మలే నేస్తాలు. వాటిలో నా బొమ్మ చేరడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులకు ఆదర్శంగా ఉండటమే కదా’ అంటోంది మానసి. ప్రస్తుతం పారాలింపిక్స్ పోటీలకు సిద్ధమవుతోందీమె. అందుకోసం ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టింది. ‘ప్రోస్థటిక్ లెగ్ ఆడటానికీ, నడవడానికే పనికొస్తుంది. ఓ క్రీడాకారిణికి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. అందుకే బ్లేడ్‌పై పరుగుని సాధన చేస్తున్నా. లాక్‌డౌన్‌లో ఈ పరుగుని సాధన చేశా. యాక్సిడెంట్ అయిన చాలా రోజుల తర్వాత పరుగు పెట్టడం కదా మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఇప్పుడు మామూలుగానే అనిపిస్తోంది’ అంటోంది.
ఇదీ చదవండి: 'మహిళా క్రికెట్‌కు మా మద్దతు ఉంటుంది'